చైల్డ్​ సైంటిస్టుల ప్రాజెక్టులు సూపర్​ .. ముగిసిన రాష్ట్ర స్థాయి సైన్స్​ ఫేర్​

  • జాతీయ స్థాయికి 29 ప్రదర్శనలు ఎంపిక
  • చదువుతోనే ఫ్యూచర్​ 
  • జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి

మహబూబ్​నగర్​, వెలుగు :మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్​లోని ఎస్​వీకేఎం స్కూల్​లో మూడు రోజులుగా నిర్వహిస్తున్నరాష్ట్ర స్థాయి సైన్స్​ ఫేర్​ గురువారం ముగిసింది. సైన్స్​ ఫేర్​లో చైల్డ్​ సైంటిస్టుల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్లు ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, కమ్యూనికేషన్, సహజ వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గణిత నమూనాలు, ఆలోచనలు, వ్యర్థాల నిర్వహణ, వనరుల నిర్వహణ వంటి వాటిపై 863 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన న్యాయ నిర్ణేతలు గురువారం ఇన్​స్పైర్​ విభాగంలో 29 ప్రాజెక్టులను జాతీయ స్థాయికి, ఆర్​ఎస్​బీవీపీ విభాగంలో 25 ప్రాజెక్టులను ఎంపిక చేశారు.

మూడు రోజుల పాటు మొత్తం 30 వేల మంది స్టూడెంట్లు, 800 మంది టీచర్లు ప్రాజెక్టులను పరిశీలించారు. ముగింపు సందర్భంగా కలెక్టర్​ విజయేందిర బోయి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎంపికైన ప్రాజెక్టుల సైంటిస్టులను సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతోనే పిల్లలకు ఫ్యూచర్​ ఉంటుందన్నారు. కొందరు పొలిటికల్​ లీడర్​ కావాలని అనుకుంటున్నారని, పొలిటికల్​ లీడర్​ అయితే పిల్లను కూడా ఇవ్వరన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో 28 వేల మంది స్టూడెంట్లు గవర్నమెంట్​ స్కూల్స్​లో చదువుకుంటున్నారని, వారిని మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.

సర్కారు బడుల బలోపేతానికి రాష్ర్ట ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించుకుంటామన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ మంది ఆడ పిల్లలు చదువులను దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్​, ఎస్పీలను స్పూర్తిగా తీసుకొని వారు ఉన్నత చదువులు చదవాలన్నారు. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలు తాను అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.