భూగర్భ జలాలు ఎంత తోడుతున్నరు.?

భూగర్భ జలాలు ఎంత తోడుతున్నరు.?
  • లెక్కలు తీయనున్న గ్రౌండ్ వాటర్ అథారిటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల వినియోగంపై పర్యవేక్షణ చేపట్టాలని భూగర్భ జలాల స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఎక్కడెక్కడ.. ఎంతెంత.. నీటిని తోడేస్తున్నారో లెక్కలు తీయనున్నది. పరిశ్రమలు సహా రాష్ట్రంలోని అన్ని బోర్​వెల్స్ నుంచి తోడుతున్న నీటి లెక్కలను మానిటర్ చేయనున్నది. అందుకు బోర్​వెల్స్ నుంచి తోడుతున్న నీళ్లు ఎంతో తెలుసుకునేందుకు జియో (భూగర్భ) మానిటరింగ్ యాప్​తో క్యాప్చర్ చేయాలని నిర్ణయించింది. గురువారం జలసౌధలో నిర్వహించిన స్టేట్ లెవెల్​ స్టాండింగ్ కమిటీ భేటీలో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చాలా పరిశ్రమలు నదులు, ఇతర వనరుల ద్వారా నీటిని సేకరిస్తున్నాయి. బోర్​వెల్స్ నుంచి కూడా నీళ్లు తోడుకుంటున్నాయి. వాటి మీద ఇకపై పర్యవేక్షణ ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పరిశ్రమల నుంచి సెంట్రల్ ​గ్రౌండ్ అథారిటీ నిర్ణయించిన ధరలకు అనుగుణంగా చార్జీలను వసూలు చేయనున్నారు. దీని ద్వారా వాటర్ డిపార్ట్​మెంట్​కు కొంత రెవెన్యూ వస్తుందన్న యోచనలో అధికారులున్నారు.

సెంట్రల్​ పోర్టల్​లో డేటా అప్​లోడ్

రాష్ట్రంలో బోర్​వెల్స్ ద్వారా తోడుతున్న నీటి వివరాలను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఏయే జిల్లాల్లో.. ఎంతెంత.. వాడకం ఉన్నది, పరిశ్రమలు ఎంత నీటిని వాడుతున్నాయి, పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్న చార్జీల వివరాలలన్నీ ఇంగ్రెస్ సాఫ్ట్​వేర్​ ద్వారా అప్​లోడ్ చేయనున్నారు. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్​, మున్సిపాలిటీ, కార్పొరేషన్​, జీహెచ్​ఎంసీల పరిధిలోని ప్రాంతాల్లో ఒక వాటర్ ఇయర్​లోని గ్రౌండ్ వాటర్ స్టేటస్​ను అప్​డేట్ చేయనున్నారు. రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ ఎక్స్​ప్లాయిటేషన్ ఎక్కువగా జరుగుతున్నదని సమావేశంలో చర్చించారు. చాలా పట్టణాల్లో నీటిని సాధారణ స్థాయికి మించి తోడేస్తున్నట్లు గుర్తించారు. 

హైదరాబాద్‌‌పై ఫోకస్​

20 మీటర్ల లోతుకు మించి నీటిని తోడేస్తే దాన్ని ఓవర్ ఎక్స్​ప్లాయిటేషన్​గా అధికారులు చెప్తున్నారు. చాలా జిల్లాల్లోనూ ఈ పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు. హైదరాబాద్ సిటీలోనే అత్యధికంగా నీటిని తోడుకుంటు న్నట్లు చెప్తున్నారు. సిటీలో బోర్​వెల్స్ రీచార్జ్​ (భూగర్భజలాల పెరుగుదల) తక్కువగా ఉంటున్నా.. ఎక్కువ లోతుల నుంచి కూడా అవసరాల కోసం నీటిని తోడుతున్నట్టు గుర్తించారు. వంద శాతం ఎక్స్​ప్లాయిటేషన్​ హైదరాబాద్​లోనే జరుగుతున్నట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సిటీలో గ్రౌండ్​ వాటర్​పై మరింతగా ఎక్కువ మానిటరింగ్ చేయాలని భావిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భూగర్భ జలాల వాడకం తక్కువగా ఉన్నట్టు తేల్చారు.