అర్హత లేకున్నా వైద్యం .. మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్​వో తనిఖీల్లో బట్టబయలు

అర్హత లేకున్నా వైద్యం .. మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్​వో తనిఖీల్లో బట్టబయలు
  • ఎంబీబీఎస్​ చదవకుండానే అబార్షన్లు, ఆపరేషన్లు
  • ఫస్ట్ ఎయిడ్​సెంటర్ల పేరుతో ఆస్పత్రుల నిర్వహణ
  • క్లినిక్​లలో బెడ్లు ఏర్పాటుచేసుకొని వైద్యచికిత్సలు
  • ఇంజెక్షన్లు ఇవ్వడమే నేరమంటున్న అధికారులు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో కొందరు అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారు. రోజురోజుకూ నకిలీ వైద్యుల ఆగడాలు శృతిమించుతున్నాయి. క్లినిక్​లను ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఎయిడ్​ కు మాత్రమే పరిమితం కావాల్సిన కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు ఆపరేషన్లు, అబార్షన్లకు కూడా వెనుకాడడం లేదు. అనుకోని ఘటనల్లో పేషెంట్ల ప్రాణాలు పోతే, మృతుల బంధువులకు ఎంతోకొంత చెల్లించి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. వీటన్నింటిపై వరుస ఫిర్యాదులతో జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. 

ఒక క్లినిక్​లో ఆరు బెడ్లను ఏర్పాటుచేసి వైద్యం చేస్తుండడాన్ని గుర్తించి డీఎంహెచ్​వో ఆధ్వర్యంలో దాన్ని సీజ్​చేశారు. రెండు వారాల కింద జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీ చేయగా 41 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. అర్హతకు మించి వైద్యం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఆర్నెళ్ల కింద కూడా జిల్లాలో ఇలా 122 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై నేషనల్​ మెడికల్​ కమిషన్​ (ఎన్​ఎంసీ యాక్ట్) సెక్షన్లు 34, 54 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడుతున్రు.. 

రెండు వారాల కింద ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీమ్​ లు తనిఖీలు నిర్వహించాయి. ఆర్​ఎంపీ, పీఎంపీలుగా బోర్డులు పెట్టుకొని, ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్లు లేకున్నా పేషెంట్లకు యాంటీబయాటిక్స్​, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, పెయిన్​ కిల్లర్లను ప్రిస్క్రిప్షన్​ లు రాస్తున్నారని ఆఫీసర్లు గుర్తించారు. 

పేషెంట్లకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి, మిగిలిన ట్రీట్ మెంట్ కోసం సర్టిఫైడ్, ప్రొఫెషనల్​​ డాక్టర్ల దగ్గరకు పంపించాల్సి ఉండగా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు ఇవ్వడమే కాదు, ఏకంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. పోర్టబుల్ స్కానర్లతో స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడ, మగ చెప్పడం, అబార్షన్లు చేయడం.. లాంటివి చేస్తుండడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు చేసిన తనిఖీల్లో కొందరు ఆర్​ఎంపీలు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడ్డారు. తాజాగా ఈ తనిఖీలతో మరింత మంది నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది.

కమీషన్ల ఆశతో.. 

జిల్లాలో ప్రధానంగా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల మేనేజ్​ మెంట్లు ఆర్​ఎంపీలు, పీఎంపీలను కమీషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. వారు తీసుకొచ్చిన పేషెంట్లకు సంబంధించిన బిల్లులో 50 శాతం ఆర్​ఎంపీలకే కమీషన్​ గా ఇస్తున్నారు. ప్రొఫెషనల్ డాక్టర్ల ఆధ్వర్యంలో కాకుండా, మేనేజ్​ మెంట్ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ఎక్కువవుతోంది. కొత్తగా ఎవరు ఆస్పత్రి ప్రారంభించినా వ్యాపారం సక్సెస్​ కావాలంటే ఆర్ఎంపీలతో ప్రమోషన్​​తప్పనిసరి అయింది. 

వారిని ఆకట్టుకోవడం కోసం వారికి ఎక్కువ కమీషన్లు ఇస్తుండడంతో పేషెంట్ల ట్రీట్​ మెంట్ కు అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ పరీక్షలు చేయించడం, వారి నుంచి ఎక్కువ డబ్బులు గుంజడం కామన్​ అయింది. అటు అధికారులు కూడా మామూళ్ల మత్తులో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం, కంప్లైంట్లు వచ్చినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తుండడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అటు కొందరు ఆర్​ఎంపీలు, పీఎంపీలు కూడా ఇదే అదనుగా డబ్బులు దండుకుంటున్నారు. 

నేషనల్​ మెడికల్​ కౌన్సిల్ చట్టం 2019 , సెక్షన్​ 34, 54 ప్రకారం అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తే రూ.5 లక్షల జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధించవచ్చని, తెలంగాణ రాష్ట్ర మెడికల్ ప్రాక్టిషనర్స్​ రిజిస్ట్రేషన్​ యాక్ట్ 20, 22 ప్రకారం కూడా శిక్షార్హులు అవుతారని అధికారులు చెబుతున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ జీవో నెంబర్​ 47, 48 ప్రకారం ఆస్పత్రులను రిజిస్ట్రేషన్​ తప్పనిసరిగా చేయించాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. 

ఆర్​ఎంపీల వైద్యంతో ప్రాణాలు పోయిన కొన్ని ఘటనలు..

  •  ఈ ఏడాది ఆగస్టులో పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన రాయల లక్ష్మి (32)కి జ్వరం రాగా అదే గ్రామంలో ఆర్ఎంపీ దగ్గర చికిత్స చేయించుకున్నారు. జ్వరం తగ్గకపోవడంతో ఆర్ఎంపీ ఆమెకు సెలైన్ పెట్టాడు. అదే సమయంలో ఆమెకు వణుకు రావడంతో సెలైన్ ఆపి ఇంజెక్షన్ చేశారు. దీంతో లక్ష్మి అపస్మారక స్థితిలోకి పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని హాస్పిటల్ కు, అక్కడి నుంచి హైదరాబాద్​ తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. తర్వాత వేంసూరు మండలం చౌడారం తండాలో కూడా ఆర్ఎంపీ వైద్యానికి మహిళా మాజీ ఎంపీటీసీ ఒంగోరు లక్ష్మి (45) చనిపోయింది. 
  •  మూడు నెలల కింద కొణిజర్ల మండలం అల్లీపురంలో చిర్రా సాయి (13) ఆర్​ఎంపీ వైద్యం వికటించి చనిపోయాడు. సాయికి జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ ఇంజెక్షన్లు వేశారు. సాయంత్రం మళ్లీ జ్వరం ఎక్కువ కావడంతో మరో ఇంజెక్షన్​ వేయగా వాంతులు చేసుకుంటూ వెంటనే చనిపోయాడు.