హన్మకొండ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాలను అందజేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో వజ్రోత్సవాలపై మంత్రి దయాకర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి, సీపీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
ఈ నెల 9న ఇంటింటికి జాతీయ జెండాలను అందజేస్తామన్న మంత్రి... నియమ నిబంధనలు అనుసరించి ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి ఓ పోలీస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల సహకారంతో వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.