జనగామ/మహబూబాబాద్: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దళితుల సమున్నత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని ఆయన చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, పెద్ద వంగర మండలాల్లో గురువారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల పార్టీ లీడర్లు, దళిత నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... దళిత బంధు పథకంతో దళితుల బతుకుల్లో వెలుగులు నిండనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం ద్వారా మొత్తం 17 లక్షల మందికి వచ్చే మూడు నాలుగు ఏళ్ళలో ఆర్ధిక సాయాన్ని అందించినున్నట్లు తెలిపారు. అందులో వచ్చే బడ్జెట్ లో ఈ పథకం అమలుకు రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాల కుటుంబాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు జమ చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, లబ్దిదారులకు శిక్షణ, పథకంపై లబ్ధిదారునికి సరైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.