శిధిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చి వేస్తున్నాం

వరంగల్: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  మండిబజార్ లో ఇల్లు కూలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. శనివారం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అనంతరం కూలిన ఇంటికి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరదల సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని పేర్కొన్నారు. నగరంలో శిధిలావస్థలో ఉన్న దాదాపు 379 ఇళ్లను గుర్తించి... వాటిని కూలగొట్టేందుకు యజమానలకు నోటీసులు పంపించినట్లు వెల్లడించారు. అందులో ఇప్పటికే దాదాపు 145 ఇళ్లను కూల్చి వేసినట్లు మంత్రి తెలిపారు.

ఇప్పటికైనా నోటీసులు అందుకున్న వారు తమ ఇళ్లను కూల్చివేయాలని, లేకుంటే మున్సిపాలిటీ అధికారులు ఆ ఇళ్లను కూల్చి వేస్తామని హెచ్చరించారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల సమయంలో సెల్ఫీలు, చేపల కోసం చెరువులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంత పెద్ద విపత్తు వచ్చినా... ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేశ్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అధికారులు తదితరులు ఉన్నారు.