సూర్యాపేట: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడు సభలో అన్ని అబద్ధాలే చెప్పారని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మునుగోడు సభలో అమిత్ షా కేసీఆర్ పై అక్కసు కనబరిచారే తప్ప... కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఆయనకు లేదని స్పష్టం చేశారు. తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని అమిత్ షాపై మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న మంత్రి... పెట్రోల్ ధరల విషయంలో అమిత్ షా మాటలు దొంగే దొంగన్నట్లుగా ఉన్నాయన్నారు.
మునుగోడు సభలో వరాలు కురిపిస్తారని రాష్ట్ర బీజేపీ నాయకులు భావించారని... కానీ అమిత్ షా వాళ్లకి నిరాశ మిగిల్చారని ఎద్దేవా చేశారు. అమిత్ షా పర్యటన వల్ల మునుగోడుకు గానీ, రాష్ట్రానికి గానీ ఒరిగిందేమీ లేదని చెప్పారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి ఓట్లు, సీట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమన్న మంత్రి జగదీశ్ రెడ్డి... బీజేపీ అధికారంలోకి వస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని చెప్పారు.