నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేశ్వరితో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సభకు కావాల్సిన ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ తమకు పోటీ కానేకావని స్పష్టం చేశారు. ఈ నెల 20న మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందన్న ఆయన... బీజేపీ అసమర్థ పాలన, టీఆర్ఎస్ అభివృద్ధి పాలనపై సీఎం కేసీఆర్ మాట్లాడుతారని తెలిపారు. త్వరలోనే టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తులు లేరని... కేవలం ఆశావహులు మాత్రమే ఉన్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా వామపక్షాల మద్దతు తమకే ఉంటుందని మంత్రి తెలిపారు. ఇక రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందారని మంత్రి ఎద్దేవా చేశారు.
ఇక... కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 8న తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేసినట్లు పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి... అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరుకానుండగా... రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అంతే కాకుండా రాష్ట్రం నుంచి ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మూడు నెలల్లో ఉప ఎన్నికలు తథ్యమని వార్తలు వస్తున్న నేపథ్యంలో... మునుగోడు ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా సభ కంటే ముందే కేసీఆర్ సభను నిర్వహించాలని టీఆర్ఎస్ భావించింది. ఈ క్రమంలోనే ఈ నెల 20న మునుగోడులో కేసీఆర్ సభను నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది.