పెబ్బేరు, వెలుగు: సమాజంలో గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించడానికి చదువు ఒక్కటే మార్గమని, సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం మండలంలో పర్యటించిన మంత్రి.. ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఎంపీడీవో ఆఫీస్‌లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
.అనంతరం ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ శైలజ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. అలాగే రూ. 2.40 కోట్లతో నిర్మించిన వెంకటాపూర్–బునియాదిపూర్ హై లెవల్ బ్రిడ్జిని కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ తో కలిసి ప్రారంభించారు.
సుగూరు గ్రామంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ సూచించిన బాటలో నడుస్తూ స్ఫూర్తిని పొందాలని సూచించారు. సూగూరు గ్రామానికి అవసరమైన సౌలతులు, నల్లవాగు చెరువు కట్ట పనులు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పేదలు సైతం ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివించి రూ.లక్షలు ఖర్చు చేసి నష్టపోతున్నారన్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లకు బోధనలో సరైన శిక్షణ ఉండక నాణ్యమైన విద్య అందదని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. జడ్పీటీసీ పద్మ, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ ఛైర్మన్ కర్రెస్వామి, డీఆర్డీవో నాగేంద్రం, పీఆర్ ఈఈ మల్లయ్య, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో రవీంద్ర, ఎంపీవో రోజా పాల్గొన్నారు.
రైతులకు సాగు నీరివ్వాలి
వనపర్తి: ఆఫీసర్లు తమ పూర్తి అధికారాలను వినియోగించి జిల్లాలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి కృషి చేయాలని, కాలువల్లో వెంటనే డీ సిల్టింగ్ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి విద్య, వైద్యం, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
టీచర్లు సమయపాలన పాటించేలా డీఈవోలు, ఎంఈవోలు పర్యవేక్షించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు కంప్లీట్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సబ్ స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2017–18లో శాంక్షన్ అయినా, నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడానికి గల కారణాలపై ప్రశ్నించారు.
గృహజ్యోతి కింద జిల్లాలో 63 వేల మందికి మాత్రమే లబ్ది జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఎమ్యెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ అత్యవసర సేవల కోసం వచ్చే వారిని రెఫర్ చేసే పద్దతికి స్వస్తి పలకాలన్నారు. రోగుల విషయంలో సిబ్బంది ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. జిల్లాలో 70 మినీ లిఫ్ట్ లలో మోటార్లు పని చేయడం లేదని, వాటిని వినియోగంలోని తేవాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేశ్, ఎంపీపీ కిచ్చారెడ్డి పాల్గొన్నారు.