రాజన్న సిరిసిల్ల జిల్లా: సంక్షేమ పథకాలకు తెలంగాణ ట్రేడ్ మార్క్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణకు పోరాటాలు కొత్త కాదన్న మంత్రి... 1948లో నిజాం ప్రభువుపై పోరాటం మొదలు 2014లో రాష్ట్రం సాధించుకునే వరకు అనేక పోరాటాల్లో ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి గొప్ప నాయకుడి పేరును రాష్ట్ర కొత్త సచివాలయానికి పెట్టడం హర్షణీయమన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్లలో ఒక్క డిగ్రీ కాలేజీ మాత్రమే ఉండేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు సహా అనేక ఇతర కళాశాలలు ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకోసమే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కుల, మతాల పేరుతో చిచ్చు పెడుతుండ్రు
కుల, మతాల పేరుతో కొన్ని పార్టీల నేతలు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. చిల్లర మాటలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, అలాంటి వాళ్ల మాటలు పట్టించుకుంటే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురవుతుందని చెప్పారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని కుల, మతాల పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడం లేదన్న కేటీఆర్... రాష్ట్రానికి కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వలేదని చెప్పారు. గొడవలు పెట్టి ఓట్లు సంపాదించాలనేదే బీజేపీ నినాదమని, వాళ్లకు అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టదని కేటీఆర్ విమర్శించారు.