వనపర్తి, వెలుగు: నియోజకవర్గంలోని మున్నూరు కాపులందరికీ అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బండారు నగర్ లో కొత్తగా నిర్మించిన మున్నూరు కాపు మినీ ఫంక్షన్ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు పేద విద్యార్థులకు చేయూతనందిస్తే ప్రతిభను చాటుతారని చెప్పారు. సివిల్స్ ర్యాంకులు సాధిస్తున్న వారిలో 90 శాతం మంది మధ్య, దిగువ మధ్య తరగతి పిల్లలు ఉంటున్నారని తెలిపారు.
సామాన్యులకు సహకారం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. తన వంతుగా రూ.20 లక్షల వరకు మున్నూరు కాపు వసతిగృహానికి సాయం చేస్తానని, 4 నుంచి 5 గుంటల స్థలం కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ చైర్మన్ పలుస రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు కృష్ణ, రాధాకృష్ణ, మణికొండ వెంకటేశ్వరరావు, రమేశ్, కొండ దేవయ్య, శ్రీకాంత్, కృష్ణయ్య, భానుప్రసాద్ పాల్గొన్నారు.