- నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో రిటైనింగ్ వాల్ కు కొత్త డిజైన్
- ఖమ్మం చుట్టూ జాతీయ రహదారులతో ఓఆర్ఆర్ ఏర్పాటు
- సర్వీస్ రోడ్ల ఏర్పాటుపై హైవే అధికారులతో మాట్లాడతాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మంలో గీతకార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో ఇటీవల వరదల కారణంగా డ్యామేజీ అయిన ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిని 100 రోజుల్లో రిపేర్ చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి పిల్లర్లకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, స్లాబ్ పక్కకు జరిగిందని చెప్పారు. రోడ్లు భవనాల శాఖ మంత్రితో మాట్లాడి వైజాగ్ కు చెందిన నిపుణులతో పరిశీలన జరిపామన్నారు.
బ్రిడ్జిలో మొత్తం 24 స్పాన్ లలో, 9 పక్కకు జరిగాయని గుర్తించామని చెప్పారు. హై లెవెల్ కమిటీ సమావేశంలో ఈ పనులను సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించామని, పునరుద్ధరణకు మరో 100 రోజుల సమయం పడుతుందని తెలిపారు. అప్పటి వరకు దానిపక్కనే ఉన్న పాత కాజ్ వేను రాకపోకలకు ఉపయోగించేలా చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడూ మున్నేరుకు 42 అడుగులు వరద రాలేదని, దీనికి అనుగుణంగా నిపుణుల కమిటీతో రిటైనింగ్ వాల్ రీ డిజైనింగ్ చేయిస్తున్నామన్నారు.
ఖమ్మం నగరంలోని డ్రైయిన్ నీరు, వాన నీటిని మళ్లీ నదిలోకి ఎలా వెళ్లాలి అనేది సర్వే చేస్తున్నామని చెప్పారు. మున్నేరుతో పాటు అలుగువాగు, ఇతర చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ ను నిర్ధారించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి పాత మ్యాప్ లను తెప్పిస్తున్నామన్నారు. ఆ తర్వాత నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను, కబ్జాలను తొలగించే ప్రక్రియను చేపడతామని చెప్పారు.
జాతీయ రహదారుల పనులపై..
రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులతో ఖమ్మం, కోదాడ 31 కిలోమీటర్ ల జాతీయ రహదారి పూర్తి చేసామని తుమ్మల తెలిపారు. ఖమ్మం, దేవరపల్లి జాతీయ రహదారి ఉగాది వరకు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న జాతీయ రహదారులతో ఖమ్మం నగరం చుట్టూ రింగ్ రోడ్డు తయారవుతోందని చెప్పారు. కాచిరాజుగూడెం నుంచి దారేడు వరకు మిగిలిన 6 కిలోమీటర్ల జాతీయ రహదారి రూ.120 కోట్లు మంజూరు చేసి జాతీయ రహదారి అమరావతి రోడ్డుకు కలుపుతున్నామని, దీంతో ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పరిధిలోనే రూ.750 కోట్ల నష్టం జరిగిందని, వీటిని తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తామని, వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వరదల్లో సహాయక చర్యలు భేష్
వరదల కారణంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా దెబ్బతిందని, పునరుద్ధరణ పనుల్లో కలెక్టర్ సహా అధికారులు బాగా కష్టపడి పనిచేశారని అభినందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టి, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడంలో సఫలీకృతులయ్యారన్నారు. మున్నేరు నదీ బేసిన్ పక్కన ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇరిగేషన్ సీఈ విద్యాసాగర్, ఆర్ అండ్ బీ సీఈ మోహన్ నాయక్ పాల్గొన్నారు.
గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ
ఖమ్మం టౌన్ : గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ కిట్ల ద్వారా గౌడన్నలకు భద్రత ఉంటుందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం సహకారంతో ఖమ్మంలో 100 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం భద్రత కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటమయ్య రక్షణ కవచం కిట్ల వల్ల కల్లు గీత కార్మికులు చెట్ల పైకి వెళ్లినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారన్నారు. వైన్ షాప్ పర్మిట్ రూమ్, బార్లను రెగ్యులర్ గా చెక్ చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
దేవాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద మద్యం దుకాణాలు ఉండకుండా చూడాలన్నారు. అంతకు ముందు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో చేపట్టిన స్ట్రాం వాటర్ డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరదలతో దెబ్బతిన్న ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.