సంగారెడ్డి టౌన్, వెలుగు: మాదక ద్రవ్యాల నిర్మూలనలో సంగారెడ్డి జిల్లా ముందుందని స్టేట్ నార్కోటిక్ బ్యూరో డీజీ సందీప్ శాండిల్య అన్నారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ రూపేశ్‌రెడ్డితో కలిసి నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. రూ.60 కోట్ల విలువైన అల్ఫ్రాజోలం తరలిస్తున్న ముఠాను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులను అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ డయల్ 100 కాల్స్‌కు స్పందించేందుకు అవసరమైన 20 ట్యాబ్‌లు, 10 బ్రీత్ ఎనలైజర్ కిట్లు, ఐదు హ్యాండ్ కెమెరాలను అందించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ రవాణా, ఆన్‌లైన్ మోసాలపై జిల్లాప్రజలు, స్టూడెంట్స్‌కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మీటింగ్‌లో అడిషనల్ ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ విజయ్ కృష్ణ పాల్గొన్నారు.