
- మొత్తం ఆరు ఆపరేషన్ థియేటర్లతో ఏర్పాటు
- రూ.45 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం
- హార్ట్, కిడ్నీ, లంగ్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు మాడ్యులర్ ఓటీలు
- ఈ నెలాఖరులో ప్రారంభించనున్న హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్(ఎస్ఓటీసీ) నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెలాఖరులో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఈ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎస్ఓటీసీని రూ.45 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు, లేటెస్టు టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.
గవర్నమెంట్ సెక్టార్‌లో నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్లకు ఇప్పటివరకు కేంద్రంగా ఉంది. గాంధీ ఎస్ఓటీసీ అందుబాటులోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్లకు గాంధీ కేరాఫ్‌గా మారనుంది. ముఖ్యంగా పేద ప్రజలకు అందని ద్రాక్షగానే ఉన్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్‌మెంట్ అన్ని వర్గాలకు అందుబాటులోకి రానుంది.
మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు..
ఎస్ఓటీసీలో పేషెంట్లకు, డాక్టర్లకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు ఉండేలా నిర్మిస్తున్నారు. కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్లకు సంబంధించి హైఎండ్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, రెండు ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్లు థియేటర్లు, మూడు పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేశారు. డోనర్లు, రిసీవర్లకు సెపరేట్ ఆపరేషన్ థియేటర్లు, వాటిని కలుపుతూ.. ఎంట్రీలు ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఆపరేషన్ థియేటర్ నుంచి ఆడిటోరియంలోకి 4కే వీడియో క్వాలిటీతో లైవ్ ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వన్ వే వీడియో టు వే ఆడియో సౌకర్యం ఉండేలా చూస్తున్నారు. ఈ ఆడిటోరియం నుంచి వైద్య విద్యార్థులు ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లను లైవ్‌లో వీక్షిస్తారు. ఏమైనా డౌట్లు వస్తే ఆడియో సౌకర్యం ద్వారా డాక్టర్లను అడిగితెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవే కాకుండా స్టెరిలైజేషన్ రూమ్, సప్లై రూమ్, ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఉండేలా నిర్మిస్తున్నారు.
రూ.45 కోట్ల వ్యయం..
గాంధీ హాస్పిటల్‌లో ఎన్ఓటీసీ నిర్మించాలని 2017లో ప్రతిపాదనలు చేసినా.. పట్టాలెక్కలేదు. 2022 నుంచి ఎస్ఓటీసీ పనులు ప్రారంభమయ్యాయి. మొదట నాలుగు ఆపరేషన్ థియేటర్లే అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి.
దీంతో ఆరు ఆపరేషన్ థియేటర్లు నిర్మించడానికి నిర్మాణ వ్యయాన్ని రూ.35 కోట్ల నుంచి రూ.45 కోట్లకు పెంచారు. గతంలో నత్తనడకన సాగిన పనులు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే ఆర్గాన్ డొనేషన్‌ను ప్రొత్సహించేలా చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.