మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ఆధునిక సమాజంలో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని రాష్ర్ట పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్​ ధనసరి అనసూయ సీతక్క అన్నారు.  ములుగులో సర్వర్​ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  సమాజంలో అణగారిన వర్గాలకు సేవచేస్తూ వారిని అక్కున చేర్చుకోవాలన్నారు.  

మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు ఆర్థికంగా బలంగా మారాలన్నారు.  సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్​, మహబూబాబాద్​ సబ్​రిజిస్ట్రార్​తస్లీమా, మంత్రి సీతక్క తల్లి సమ్మక్క, వివిధ సంఘాల మహిళా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

ఐటీడీఏలను నిర్వీర్యం చేసిన బీఆర్​ఎస్​ 

హనుమకొండ, వెలుగు: గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనలో ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండ గోపాలపూర్‌‌లోని ఆదివాసీ ఆత్మీయ సమ్మేళన సన్మాన సభకు  ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మంత్రి సీతక్కకు సన్మానం చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ మంత్రి కావడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమమన్నారు. ఆదివాసీల న్యాయమైన డిమాండ్స్ ను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు