పాల్వంచ, వెలుగు : మండలంలోని ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో రజనీకుమారి సాంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారి శేష వస్త్రాన్ని బహుకరించారు. ఆలయంలో రెండు రోజులుగా జరుగుతున్న పవిత్ర ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు.108 సువర్ణ పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించారు.
పంచాయతీ కార్మికులు వినతి
ములకలపల్లి : మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి గంటా శ్రీనివాసరావు, అధ్యక్షుడు చిక్కుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం మండలంలోని సీతాయిగూడెం గ్రామంలో మంత్రి సీతక్కకు గ్రామ పంచాయతీ కార్మికులు వినతిపత్రం అందజేశారు.
ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిటికె రామకృష్ణ, వర్క రుక్మధరావు, గద్దల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.