
వనపర్తి, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నికల వ్యయంపైన హరీశ్‌రావు అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి వ్యయ పరిమితి లేదని బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ద్వారా తనకు డబ్బులు వస్తున్నాయని ఆరోపణలు చేయడం సరికావన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఎమ్మెల్యే వర్గం, చిన్నారెడ్డి వర్గమంటూ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. మార్చి 2న జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో రూ. వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. సెగ్మెంటులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలో చెప్పాలన్నారు.