- వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ
వనపర్తి, వెలుగు: ధరణి సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో కొత్త ఆర్వోఆర్చట్టాన్ని తీసుకువస్తున్నట్లు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వెల్లడించారు. వనపర్తి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ముసాయిదా చట్టంపై అడ్వకేట్లు, రైతులు, వివిధ సంఘాల నాయకుల నుంచి శనివారం సలహాలు సూచనలు తీసుకున్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చిన్నారెడ్డి హాజరై మాట్లాడారు. కౌలు రైతులకు న్యాయం చేయడానికి కౌలు చట్టం రాబోతుందన్నారు. భూ రికార్డుల విషయంలో అధికారులు తప్పులు చేయవద్దని సూచించారు. గత ప్రభుత్వం కొంత మంది స్వలాభం కోసమే ధరణి చట్టాన్ని తీసుకొచ్చిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆరోపించారు.
ధరణి వల్ల దాదాపు 20 లక్షల పట్టా భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో చేరాయని పేర్కొన్నారు. కొత్త చట్టంపై ప్రొఫెసర్ భూమి సునీల్ పీపీటీ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, అడిషనల్కలెక్టర్ నగేశ్, డీసీసీబీ చైర్మన్మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ చైర్మన్ మహేశ్, వనపర్తి, మదనపూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్: త్వరలో రాబోతున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని పక్కాగా అమలు చేయనున్నట్లు పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఆర్వోఆర్- 2024 ముసాయిదాపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సదస్సు, చర్చకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి ప్రజలు, మేధావులు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుందో తెలియజేయాలన్నారు. రాత పూర్వకంగా సూచనలు, సలహాలు అందిస్తే వాటిన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తొలుత అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎస్. మోహన్ రావు ప్రతిపాదిత నూతన రెవెన్యూ చట్టం -2024లో పొందుపరిచిన సెక్షన్లు, ఉప సెక్షన్లు, క్లాజులను సమావేశానికి హాజరైన వారికి తెలియజేశారు. ఈ చర్చలో పలువురు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, పౌర సంఘాల ప్రతినిధులు, భూమితో సంబంధం ఉన్న ఎన్జీవోలు, మేధావులు పాల్గొన్నారు. గద్వాలలోనూ కలెక్టర్ సంతోష్ అధ్యక్షతన డ్రాఫ్ట్ బిల్లుపై అవగహన సదస్సు జరిగింది.
అందరి సమక్షంలో విరాసత్ చేయాలి
ఎంతమంది వారసులు ఉన్నా వారందరి సమక్షంలోనే విరాసత్ చేయాలి. ఇందుకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. - విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ బాలయ్య
తహసీల్దార్ స్థాయిలోనే..
కొత్త చట్టంలో భూ సమస్యల పరిష్కారం తహసీల్దార్ పరిధిలోనే జరగాలి. అన్ని అంశాలకు ఆధార్‌ను లింక్ చేయాలి. ఆటోమేటిక్ మ్యుటేషన్ విధానం ఉండాలి. అసైన్డ్, ఎస్సీ, ఎస్టీ, భూదాన్ భూములకు పట్టాలు చేసే అవకాశం కొత్త చట్టంలో కల్పించకూడదు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి ప్రభాకర్