వనపర్తి, వెలుగు: దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రాష్ట్ర పోలీస్ లీగల్ అడ్వైజర్ ఈపూరి రాములు తెలిపారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో కొత్త చట్టాలపై పోలీసు అధికారులు, రైటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, రిసెప్షన్ కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టాలపై కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ కొత్త చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విచారణలో మార్పులు వచ్చాయని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అవకాశం చట్టంలో కల్పించారని తెలిపారు. కొత్త సెక్షన్ల ప్రకారమే కేసులు నమోదు చేయాలని, కొత్త సెక్షన్లపై అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. ఎస్సై లు, రైటర్లు కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, నరేశ్
పాల్గొన్నారు.