వెలుగు, నెట్వర్క్: ఉచిత విద్యుత్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రేపిన మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తుండడంతో స్టేట్ పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ రూలింగ్ పార్టీ రైతువేదికల వద్ద సోమవారం పంచాయితీ పెట్టగా, సబ్స్టేషన్ల వద్ద లాగ్‌బుక్స్ కోసం కాంగ్రెస్ లీడర్లు రచ్చ చేశారు. ‘తమది మూడు పంటల పాలసీ అయితే కాంగ్రెస్‌ది మూడు గంటల కరెంట్ పాలసీ’ అంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దెప్పిపొడవగా, రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఎక్కడాఇవ్వడం లేదని, దానిని కప్పి పుచ్చుకునేందుకే లాగ్బుక్స్దాచారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. మరోవైపు ఎన్నిగంటలు కరెంట్ ఇచ్చామన్నది ముఖ్యం కాదని, పంటలు ఎండుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వేములవాడలో కామెంట్ చేయడం కాంగ్రెస్‌నేతలకు కలిసివచ్చినట్లయింది.
మూడు గంటలు కావాలా?
ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రూలింగ్పార్టీ 'మూడు పంటలు టీఆర్ఎస్ నినాదం.. -మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం' పేరుతో పదిరోజుల పాటు ‘రైతు సమావేశాలు’ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల వద్ద ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ లీడర్లు సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో రైతులంతా బిజీగా ఉండడంతో మహిళా సంఘాల సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకువచ్చి ప్రసంగాలిచ్చారు. కాంగ్రెస్ చెప్తున్నట్లు వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ కావాలో, కేసీఆర్ విధానం కింద మూడు పంటలు కావాలో రైతులు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
వైర్ పట్టుకుంటే తెలుస్తది: మంత్రి జగదీశ్ రెడ్డి
రేవంత్ రెడ్డి 24 గంటల్లో ఎక్కడికైనా వెళ్లి వైర్ పట్టుకో, వెనక్కి తిరిగి వస్తే కరెంట్ లేదని నేను ఒప్పుకుంటా’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ, నిజాయితీ ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకల్లో 24 గంటల ఉచిత విద్యుత్ కరెంట్ ఇవ్వాలని సవాల్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఓబులాయపల్లి రైతు వేదిక వద్ద మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ఇస్తున్నామన్నారు. అప్పుడు గురువు, ఇప్పడు శిష్యుడు తమ రైతు వ్యతిరేకతను బయటపెట్టుకున్నారని, మళ్లీ 3 గంటల కరెంటుతో రైతును ఆగం చేయాలని రేవంత్ కుట్ర పన్నాడని ఆరోపించారు. రేవంత్‍రెడ్డి చంద్రబాబు ఏజెంటులాగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఆరోపించారు. అసలు ఇది నిజమైన కాంగ్రెసా, చంద్రబాబు కాంగ్రెసా అని ప్రశ్నించారు.
ఆయన మధిర నియోజకవర్గం చింతకాని రైతు వేదికలో మాట్లాడుతూ రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని, ఉచితాలు ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీది ఊరికో విధానం ఉంటదని, రాహుల్ గాంధీ లీడర్ కాదు, రాసిపెట్టింది చదివి వెళ్లిపోయే రీడర్ అని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి రైతు వేదికలో ఆయన మాట్లాడారు. మాయమాటలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్ పార్టీ పగటి వేషగాళ్ల మాటలను నమ్మొద్దని...కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని బెజ్జంకి రైతు వేదికలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. తెలంగాణ ఉద్యమమే కరెంట్ మీద పుట్టిందని, ఆనాడు రైతులను కాల్చి చంపింది చంద్రబాబు నాయుడేనని హుజూరాబాద్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలో కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. 3 గంటలు కరెంట్ కావాలా, 3 పంటల కరెంట్ కావాలా అంటూ వేంసూరు మండలం అమ్మపాలెం నుంచి వెంకటాపురం వరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.
కేటీఆర్‌కు ఎడ్లు, ఎవుసం ఏం తెలుసు?: జీవన్‌రెడ్డి
కేటీఆర్‌కు ఎడ్లు, ఎవుసం ఏం తెలుసని, కాంగ్రెస్ ఉచిత కరెంట్ఇచ్చినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో సోమవారం మాట్లాడుతూ కేటీఆర్‌లాగా వాస్తవాలను వక్రీకరించడం రాహుల్ గాంధీ కి తెలియదన్నారు. 24 గంటల కరెంట్సప్లై కాంగ్రెస్ పుణ్యమేనన్నారు.
ALSO READ :జోరుగా గంజాయి దందా.. చాపకింద నీరుల వ్యాపారం
ఆంధ్రాలో కరెంట్ పరిస్థితి ఘోరం: ఎర్రబెల్లి
ఆంధ్రాలో కరెంట్ పరిస్థితి ఘోరంగా ఉందని, రాష్ట్రంలో రైతులకు ఉచితంగా24 గంటల కరెంట్ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. హనుమకొండ ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉచిత కరెంట్ విషయంలో రైతులను రేవంత్‍రెడ్డి ఇన్సల్ట్చేశాడని, ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అసెంబ్లీలో నిత్యం కరెంట్ మీద లొల్లి జరిగేదని, ఇందిరా పార్కు ముందు ధర్నాలు ఉండేవన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చే క్రమంలో లోటుపాట్లు ఉంటాయని, కానీ రైతులు ఎక్కడా ఇబ్బంది పడుతున్నట్టు కంప్లైంట్స్ లేవన్నారు.
లాగ్‌బుక్‌లు ఎందుకు దాస్తున్నరు: కాంగ్రెస్
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేది నిజమే అయితే సబ్స్టేషన్లలో లాగ్‌బుక్‌లు ఎందుకు దాస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ నేతలు రైతు సమావేశాలు నిర్వహిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్ ల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అన్ని సబ్స్టేషన్ల నుంచి లాగ్ బుక్ లను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకోగా, ఆపరేటర్లు కాగితాలపైనే టైమింగ్స్ నోట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలోని సబ్ స్టేషన్లను సందర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం నంగునూరులోని సబ్ స్టేషన్ లాగ్ బుక్ ను పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ పరిశీలించారు. అనేకసార్లు కరెంట్ ట్రిప్ అయినట్టు, గంటలకొద్దీ సప్లై నిలిచిపోయినట్టు లాగ్ బుక్ లో ఉందన్నారు. రోజుకు 10- నుంచి 12 గంటలకు మించి కరెంటు రావడం లేదని రైతులు చెప్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ అన్నారు. నారాయణరావుపేటలో ఉన్న సబ్ స్టేషన్ ను సోమవారం పార్టీ నేతలతో కలిసి సందర్శించిన ఆయన లాగ్‌బుక్‌ను పరిశీలించారు.