బీసీలు ఏకమైనప్పుడే రాజ్యాధికారం.. MASS వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు

బీసీలు ఏకమైనప్పుడే రాజ్యాధికారం..  MASS వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు

బషీర్​బాగ్, వెలుగు: బీసీలు ఏకమైనప్పుడే రాజ్యాధికారం దక్కుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మంగళవారం ‘మన ఆలోచన సాధన సమితి’(MASS) ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. గడ్డం నరసింహగౌడ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్ట్ , ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ వెంకట్ నారాయణన్ హాజరయ్యారు. 

సమితి వ్యవస్థాపకుడు కటకం నరసింగరావు బీసీ సంఘ నాయకులతో కలిసి మొదట ఫూలే విగ్రహానికి పూలమాల వేసి, సమితి జెండాను ఆవిష్కరించారు. వెంకట్ నారాయణన్ మాట్లాడుతూ.. విద్యతోనే ఏదైనా సాధ్యం అవుతుందన్నారు. బీసీలు ఉన్నత చదువులు చదివి, ఆర్థికంగా బలపడాలని అప్పుడే రాజకీయాల్లో రాణిస్తారన్నారు. దేశంలో బీసీలు జనాభాలో ప్రథమ స్థానంలో ఉన్నా.. రాజకీయంగా కింది స్థాయిలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల్లోని బీసీలు ఏకతాటిపైకి వస్తే రాజ్యాధికారాన్ని సాధిస్తారని సూచించారు. 

కటకం నర్సింగరావు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో బీసీలను చైతన్య పరచడమే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి పనిచేస్తుందని అన్నారు. రాజ్యాధికారంతోనే సమాజంలో సగభాగానికి పైగా ఉన్న బీసీ కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడితే బీసీల రాజ్యం వస్తుందని అనుకున్నామని.. కానీ ఒక వర్గానికి మాత్రమే లబ్ధి జరిగిందన్నారు. 

బీసీల్లో చైతన్యం లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలను జాగృతం చేసి , వారిని చైతన్య పరచడమే అంతిమ లక్ష్యంగా ఈ సమితి పని చేస్తుందని స్పష్టం చేశారు. బీసీ సంఘం నాయకులు దొంత ఆనందం, గడ్డం తులసి రాందాస్, కొండల్ రావు, తడక యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, అనుముల జగన్, దాసోజు లలిత, శంకర్, నాంపల్లి సుజాత, తదితరులు పాల్గొన్నారు.