బల్మూరి వెంకట్ నారాజ్.. లోకల్ లీడర్ కాదంటున్న సొంత పార్టీ నేతలు

హుజరాబాద్ లో మరోసారి పోటీకి NSUI స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ రెడీ అవుతున్నారు. బైపోల్ లో ఓటమి తర్వాత నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. అయితే.. సొంత పార్టీ నేతల తీరుతో వెంకట్ నారాజ్ అవుతున్నారట. నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా వెంకట్ తోనే తిరుగుతూ..వెనకలా నాన్ లోకల్ లీడరంటూ మాట్లాడుకుంటున్నారట. ఈ ముచ్చట ఆనోట ఈనోట వెంకట్ కు చేరిందంట. నాన్ లోకల్ అంటూ ఇమేజీ డ్యామేజీ చేస్తుండటంతో.. సొంత లీడర్లపై బల్మూరి వెంకట్ తెగ ఫీలవుతున్నారట. 

వాస్తవానికి హుజురాబాద్ లో కాంగ్రెస్ కు బలమైన లీడర్లు లేరు. అక్కడ పార్టీ గెలవక నాలుగు దశాబ్దాలు దాటింది. ఉప ఎన్నికల టైమ్ లో బల్మూరి వెంకట్ ను తీసుకొచ్చి నిలబెట్టారు. హుజురాబాద్ తో సంబంధం లేకపోయినా..యువ నాయకుడిగా బల్మూరిని బరిలోకి దించింది కాంగ్రెస్. ఓ వైపు నియోజకవర్గానికి కొత్త.. మరోవైపు నాన్ లోకల్..ఇంకోవైపు ప్రచారానికి సమయం లేకపోవడం.. ఓవరాల్ గా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. బల్మూరి వెంకట్ ఓడినా నియోజకవర్గ సమస్యలపై కొట్లాడుతున్నారు. NSUI స్టేట్ ప్రెసిడెంట్  గా విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే.. హుజరాబాద్ లో తరచూ పర్యటిస్తున్నారు. 

స్థానిక కాంగ్రెస్ కిసాన్ సెల్ నేత పత్తి కృష్ణారెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం.. బల్మూరి వెంకట్ నాన్ లోకల్ అన్నారట. లోకల్ కాబట్టి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెప్పుకున్నారట. ఈ విషయం తెలిసి వెంకట్ మరింత ఫీలయ్యారట. కష్టకాలంలో పోటీ చేసి.. పార్టీ పరువుని భుజాలపై మోస్తే తనకు దక్కిన గౌరవం ఇదేనా..? అంటూ తన అనుచరులు, అనునాయుల దగ్గర బల్మూరి వాపోయారట.

హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు పెద్దపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని వెంకట్ అనుకున్నారట. హుజురాబాద్ బైపోల్ లో పోటీకి పెద్దగా ఉత్సాహం చూపించలేదట. రేవంత్ రెడ్డి నచ్చజెప్పి బైపోల్ లో పోటీ చేస్తే.. సాధారణ ఎన్నికల్లోనూ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారట. రేవంత్ హామీతో హుజురాబాద్ లోనే ఇల్లు తీసుకుని.. పూర్తి స్థాయిలో పని చేయాలని వెంకట్ అనుకున్నారంట. సొంతపార్టీలోని కొందరి తీరుతో పరేషాన్ అవుతున్నారంట వెంకట్.