- రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు గంప నాగేందర్
- ములుగు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా బాదం ప్రవీణ్ ప్రమాణస్వీకారం
ములుగు, వెలుగు : రైస్ మిల్లర్లు ఎన్ని సమస్యల్లో ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా నాణ్యతతో కూడిన బియ్యం సరఫరా చేస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు గంప నాగేందర్ అన్నారు. ఇటీవల ములుగు జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా, అధ్యక్షుడిగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు బాదం ప్రవీణ్ ఎన్నికయ్యారు. బుధవారం ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్ లో నూతన కమిటీ ప్రమాణస్వీకారం అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు గంప నాగేందర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరిపి మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ములుగు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ తన ఎన్నికకకు సహకరించిన అసోసియేషన్ గత కార్యవర్గం, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జగన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.