స్టేట్​ రిక్రూట్​మెంట్​ బోర్డులు సక్కగ పనిచేయాలె

జాతీయ స్థాయిలో యూనియన్ ​పబ్లిక్ సర్వీస్ ​కమిషన్(యూపీఎస్సీ)​ఏటా ఒక క్రమ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తూ రిక్రూట్​మెంట్ ​చేపడుతోంది. నింపబోయే పోస్టుల వివరాలు ముందుగానే ప్రకటిస్తోంది. దాదాపు చెప్పిన తేదీల్లోనే పరీక్షలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్రాల్లో ఆ విధానం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడే ప్రభుత్వాలు నిరుద్యోగులను తృప్తి పరచడం కోసం ఉద్యోగాల భర్తీ ప్రకటనలు చేయడం ఆనవాయితీగా మారుతోంది. ఇవాళ నోటిఫికేషన్​ వస్తే పరీక్ష ఎప్పుడు పెడతారో తెలియదు. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో తెలియదు. ఈ ఏడాది పూర్తయితే మళ్లీ నోటిఫికేషన్​ ఎప్పుడు వస్తుందో ఊహించలేం. పరీక్షలు కూడా సరిగ్గా జరుపుతారన్న నమ్మకం లేదు. అయితే ఏ పరీక్షల్లోనైనా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కానీ, మౌలికంగా యూపీఎస్సీ పరీక్షలు పెడితే.. పక్షపాతముండదు, సమర్థంగా, నిజాయతీగా చేస్తారన్న విశ్వాసం ఉంది. రాష్ట్ర స్థాయి బోర్డులు కూడా సమర్థంగా పని చేయాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం మనకు కావాల్సిన పనులు చేయడం కోసం ఉంది. చట్టబద్ధ పాలన ఇవ్వడం, శాంతి భద్రతలను కాపాడటం, న్యాయం అందించడం, మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు జీవన అవసరాలైన మంచినీరు అందించడం, మురుగును తొలగించడం, రోడ్లు వేయడం వంటి పనులన్నీ ప్రభుత్వమే చేపట్టాలి. అందుకు మనం పన్నులు కడుతున్నం. ఆర్థిక వ్యవస్థ పెరిగేందుకు, ఉపాధి కల్పన జరిగేందుకు తగినట్టుగా విధానాలు రూపొందించి అమలు చేయడం, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆరోగ్యం ​అందించడం కోసమే ప్రభుత్వం ఉంది. ఈ రంగాల్లో సేవలు సక్రమంగా ప్రజలకు అందించేందుకు గానూ ఉద్యోగులను భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ నేటి ప్రభుత్వాలు ప్రజా సేవ వదిలేసి మెహర్బానీ, ఓట్ల కోసం ఉద్యోగులను తీసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తద్వారా విద్య, ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, ఆదాయాలు పెరగకపోవడం, బీదరికం పెరిగిపోవడం వంటి వాటిపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే సరైన విద్య అందించాలి. ఉపాధి కల్పన పెరిగేటట్టుగా బాటలు వేయాలి. సామాన్యుల బతుకులు బాగుపడాలంటే పనులు సమర్థంగా చేయాలి. ప్రజల హక్కులను కాపాడాలి అంటే చట్టబద్ధ పాలన ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.

అవినీతి లేకుండా..

ఉద్యోగుల రిక్రూట్​మెంట్​ప్రాసెస్​కు సంబంధించి చాలా రాష్ట్రాల్లో విపరీతమైన అవినీతి పేరుకుపోయింది. పంజాబ్​లో పబ్లిక్​ కమిషన్​అధికారులు ఎంతో మంది విధి నిర్వహణ సరిగ్గా చేయక జైలు పాలయ్యారు. మన రాష్ట్రంలో కూడా ఎంతోమందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బోర్డుల అసమర్థత కూడా నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుంటుంది. తెలంగాణలో పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో ఓ రిక్రూట్​మెంట్​విషయంలో పొరపాటు జరిగింది. ప్రశ్నా పత్రంలోని ‘కీ’ నలభై శాతం తప్పు పడింది. అది రుజువైంది కూడా. నేను స్వయంగా కమిషన్​చైర్మన్​తో మాట్లాడినప్పుడు ‘‘అది కరెక్టే సార్, ఇప్పటికే పాత కీ ప్రకారం రిక్రూట్ ​చేసేశాం. పాత ఫైలు విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.. మేం వాళ్లకు న్యాయం చేస్తాం.. దయచేసి మీరు గొడవ చేయొద్దు” అని బతిమిలాడాడు. మరి అలాంటి ‘కీ’ ఉద్యోగులను నియమించినప్పుడు వాళ్లు ప్రజలకు మెరుగైన సేవలు ఎలా అందించగలుగుతారు? బోర్డు పనితీరుకు ఇది సజీవ ఉదాహరణ. నేను స్వయంగా పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ చైర్మన్​తో మాట్లాడాను. ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ అది అలా జరిగిపోయింది. అంటే వ్యవస్థ అంత అసమర్థంగా నడుస్తోంది. పక్షపాత భయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య ఇంటర్వ్యూలు కూడా తీసి పారేశారు. మరి అది కూడా లేకపోతే అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు ఎలా అంచనా వేస్తారు? ఉంటే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ అన్నట్టుగా తయారైందీ వ్యవస్థ. 

ఉద్యోగిత రంగాలు మారుతున్నాయి..

లోకం మారుతోంది. ప్రభుత్వాల తీరు తెన్నులు కూడా మారుతున్నాయి. అందువల్ల కొన్ని రంగాల్లో ఎక్కువ శాతం ఉద్యోగుల అవసరం ఉంటోంది. మరికొన్ని రంగాల్లో ఆ అవసరం లేకపోవచ్చు. గుమస్తా గిరిలు చేసే కాలం పోయింది. ఇంతకు ముందు కాలంలో 40, యాభై శాతం ఉపాధ్యాయులు ఉంటే, మిగతా నలభై శాతం గుమస్తాలు, డ్రైవరు ఉద్యోగులు ఉండేవాళ్లు. ప్రస్తుతం గుమస్తాలు, డ్రైవర్లు అవసరమా? వాళ్లకి ఒక్కొక్కరికీ రూ. 40 వేల వరకు జీతాలు అవసరమా? కారు అలాట్​చేసినప్పుడు సొంతంగా డ్రైవ్​ చేసుకోమని చెప్పాలి. దానికి అలవెన్సులు ఇవ్వాలి. అవసరం ఉన్న చోట ఇవ్వొచ్చు. పోలీసు యంత్రాంగంలో శాంతి భద్రతల, చట్టబద్ధ పాలనా సమస్యలుంటాయి కాబట్టి, అటువంటి చోట్ల ఇలాంటి రిక్రూట్​మెంట్స్​చేయొచ్చు. ఫోరెన్సిక్ ల్యాబొరెటరీస్, క్రైమ్​ఇన్వెస్టిగేషన్​మరింత బాగుపడాలి. వాటిల్లో మెరుగైన టెక్నాలజీ రావాలి. సైబర్​క్రైమ్​లో నిపుణులు కావాలి. విద్యకు అధ్యాపకుల నెంబర్​సరిపోవచ్చు కానీ స్థాయి సరిపోదు. అలాగే ఆరోగ్య రంగంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. అదనంగా వేలాది మంది సిబ్బంది కావాలి. దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూముల సర్వేల విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. అక్కడ పటిష్టమైన సిబ్బంది కావాలి. ఇప్పుడున్న వాళ్లకు సరిగ్గా సర్వే చేయడం కూడా చేతకాదు. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో అసమర్థులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాల్లో మనకు కొరత ఉంది. ఏ నైపుణ్యంలో కొరత ఉంది? కొత్త నైపుణ్యాలు ఏం కావాలి? అని లోతుగా ఆలోచించి ఆ రిక్రూట్​మెంట్​చేస్తే ప్రజలకు సేవలు అందుతాయి.  ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గుమస్తాలను, టైపిస్టులను కూర్చోబెట్టి పనులు చేయించే పద్ధతి మారాలి. ఉద్యోగుల నిజమైన సామర్థ్యం బయటపడేటట్టు చేస్తే వాళ్లద్వారా ప్రజలకు మంచి సేవలు అందుతాయి. అంతేగాని గవర్నమెంట్​ అనేది ఊరికే ఉద్యోగాలు ఉన్నట్టుగా నటించి, కొంతమందిని ఉద్యోగాల్లో పెట్టుకుంటే సరిపోదు. ప్రజల పన్నుల డబ్బుతో ప్రజలకే సేవలందించేదే  ప్రభుత్వం.ఈ డబ్బంతా కడుతున్నది సామాన్య ప్రజలే. ఈ ఉద్యోగుల ద్వారా సేవలు అందకపోతే పన్నుల డబ్బులన్నీ వృథానే కదా!

బోర్డు సభ్యుల నిజాయితీ..

సమర్థమంతమైన, నిజాయితీ పరులైన బోర్డు సభ్యులుంటే రిక్రూట్​మెంట్అనేది సమర్థంగా, ప్రామాణికంగా జరుగుతుంది. పేరు ఏం పెట్టారు, ఎవరు చేశారు అన్నది ముఖ్యం కాదు. ఎలా చేశారు అన్నదే ముఖ్యం. యూపీఎస్సీ బ్రహ్మాండంగా చేస్తోంది. రాష్ట్రాల్లో పబ్లిక్​సర్వీస్​  కమిషన్స్​ సరిగ్గా చేయడం లేదు. రెండూ రాజ్యాంగ బద్ధమైనవే. పేరుగొప్ప ఊరు దిబ్బ అయితే ఉపయోగం ఏం ఉంది? ఆంధ్రా, తెలంగాణలో పోలీస్​రిక్రూట్​మెంట్స్ బోర్డు సభ్యుల ఆధీనంలోనే జరుగుతున్నాయి. వాటిపై ఆరోపణలు లేవు. ఆ రకంగా చేయగలిగితే రాష్ట్రం సమర్థంగా ముందుకెళుతుంది. సింగ​పూర్ ​వంటి దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేందుకు ప్రజలు ముందుకు రారు. అక్కడ అవినీతి, అసమర్ధత మచ్చుకైనా కనిపించదు. ప్రజలను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకోడానికి పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ రకరకాల ఆకర్షణలతో పాట్లు పడుతుంది.​ మన దగ్గర అలా కాదు. ఎంఏ చదివినవాడు కూడా బంట్రోతు ఉద్యోగం చేయడానికి రెడీ అయిపోతాడు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి, ధోరణి మారాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. 

ఎక్కడ అవసరమో గుర్తించాలి

గవర్నమెంట్ కు వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ప్రభుత్వం సమర్థంగా పనిచేసే యంత్రాంగాన్ని తయారు చేయాలి. దానికి తగినట్టుగా ఎక్కడ ఉద్యోగులు అవసరమో గుర్తించి, నైపుణ్యం ఉన్నవారిని అక్కడ రిక్రూట్​చేయాలి. వాళ్లతో సరిగ్గా పనులు చేయించగలగాలి. అదంతా వదిలేసి  ప్రస్తుత ప్రభుత్వాలు ఉద్యోగ వ్యవస్థను ఒక సంతర్పణలా తయారు చేస్తున్నాయి. అలాగని ప్రభుత్వాలు ఉన్నది అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు. సమాజానికి కొన్ని అవసరాలుంటాయి. ఎన్నో రంగాల్లో ఎంతోమంది ఉద్యోగులు అవసరం అవుతున్నారు. జర్నలిజం, మీడియా, ఎలక్ట్రానిక్​ వంటి రంగాల్లో ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది. కొన్ని దేశాల్లో అయితే గవర్నమెంట్​ ఉద్యోగం చేయడానికి కూడా ఒప్పుకోని వారున్నారు. 
- జయ ప్రకాశ్​ నారాయణ, లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకులు