కేసీఆర్​ ఎంపీ సీట్లు అమ్ముకొని.. బిడ్డను కాపాడుకోవాలనుకుంటున్నడు: కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు :  బీఆర్‍ఎస్‍ తరఫున గెలిచే ఎంపీలను బీజేపీకి అమ్మి తన బిడ్డ కవితను కాపాడుకోవాలని కేసీఆర్‍ చూస్తున్నాడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్‍ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బుధవారం నామినేషన్‍ వేయగా..ఆమెను కొండా సురేఖ బలపరిచారు. తర్వాత 

నిర్వహించిన ప్రెస్​మీట్​లో కావ్యతో కలిసి సురేఖ మాట్లాడారు. కవిత అరెస్ట్​ పేరుతో బీజేపీ హైప్‍ పెంచుకునేందుకు డ్రామాలాడుతోందన్నారు. కాంగ్రెస్‍ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‍లో ఉన్నారని కేసీఆర్‍ ఊహించుకుంటున్నాడని.. వారిని అలా అయినా కాసేపు సంతోషపడనివ్వండని ఎద్దేవా చేశారు. కవిత లిక్కర్‍ కేసు, కేటీఆర్‍ ఫోన్‍ ట్యాపింగ్‍ ఇష్యూలను భరించలేక బీఆర్ఎస్​ సీనియర్‍ లీడర్లు పార్టీని వీడుతున్నారని..అందులో కడియం శ్రీహరి ఒకరన్నారు. 


బీఆర్‍ఎస్‍, బీజేపీ ఒక్కటేనని..లోలోపల కలిసి మెలిసి పనిచేస్తూనే, బయట మాత్రం తిట్టుకున్నట్లు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‍, కేటీఆర్‍ 10-–12 పార్లమెంట్‍ సీట్లు గెలిస్తే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామని చెబుతున్నారని..ఎలా వస్తారో చెప్పాలన్నారు. కేటీఆర్‍ వరంగల్‍ పర్యటనలో తాను నియోజకవర్గ జనాలకు అందుబాటులో ఉండట్లేదని మాజీ ఎమ్మెల్యే నరేందర్‍ మాట్లాడారని, తాను నిత్యం తూర్పు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. ఆయన తండ్రిగా చెప్పుకునే కేసీఆర్‍ తొమ్మిదిన్నరేండ్లు ఏంచేశారో చూసుకుంటే మంచిదన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, ఈవి.శ్రీనివాస్‍ పాల్గొన్నారు.