
- ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
- సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
- మరో 110 మీటర్ల తవ్వకం పూర్తయితే మృతుల ఆచూకీ తెలిసే అవకాశం
అమ్రాబాద్, వెలుగు: రెండున్నరేళ్లలో ఎస్ఎల్‌బీసీ పూర్తి చేసి నల్గొండ జిల్లాకు సాగునీరు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను ఆయన సందర్శించారు. అధికారులతో మాట్లాడి రెస్క్యూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి స్పెషల్ ఆఫీసర్ శివ శంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, పలు రకాల రెస్క్యూ టీమ్ ప్రతినిధులు నిరంతరం సేవలందిస్తున్నారు.
నిమిషానికి పదివేల లీటర్ల నీటి ఊట బయటకు..
నిమిషానికి పదివేల లీటర్ల నీటి ఊటను నిరంతరం భారీ పంపుల ద్వారా బయటకు పంపుతూ, టన్నెల్ లోపల ఉన్న టీబీఎం మెషీన్ అవశేషాలు, మట్టిని తొలగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో పనులు మరింత వేగవంతం అయ్యాయన్నారు. సహాయక చర్యలు మరో 15 రోజుల్లో పూర్తయి టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన మిగిలిన వారి డెడ్ బాడీలు వెలికి తీస్తామన్నారు. ప్రమాద ప్రాంతంలో 250 మీటర్ల మేర నీరు, రాళ్లు, మట్టి, బురద పేరుకుపోయాయని, ఇప్పటికీ 140 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయన్నారు. 110 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయితే మృతుల ఆచూకీ తెలుస్తుందన్నారు.
మూడు షిప్టులు.. 800 మంది విధులు
40 రోజులుగా వివిధ సంస్థలకు చెందిన 800 మంది రెస్క్యూ టీమ్స్ మూడు షిప్టులుగా విధులు నిర్వహిస్తున్నారు. టన్నెల్‌లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వల్ల బురద తొలగింపు కష్టసాధ్యంగా మారింది. డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రత్యేక పర్యవేక్షాణాధికారి శివ శంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, ఎన్‌డీఆర్ ఎఫ్ అధికారి డాక్టర్ హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, జీఎస్‌ఐ అధికారులు రాజశేఖర్, కడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్, జెపీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.