ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • కూసుమంచి, పెనుబల్లి, సత్తుపల్లిలో మంత్రి పర్యటన

కూసుమంచి, వెలుగు: ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పెనుబల్లి, సత్తుపల్లిలో శనివారం ఆయన పర్యటించారు. తొలుత కూసుమంచి తహసీల్దార్​ఆఫీస్​లో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నిర్భయంగా ఉండాలని, పండించిన ప్రతీ గింజను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు.

సన్న వడ్లకు క్వింటాకు అదనంగా రూ. 500 చెల్లిస్తామన్నారు. నాయకన్ గూడెంలో ఇటీవల వరదల్లో మృతి చెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల కుటుంబసభ్యులకు కూసుమంచిలో ఇండ్ల స్థలాలను అందజేశారు. అలాగే పాలేరులో నాయకన్​గూడెంకు చెందిన నూకల నరేశ్ కుమార్తె వివాహ వేడుకకు మంత్రి హాజరై వధువరులను ఆశీర్వదించారు.

ఇటీవల మృతి చెందిన బానోతు కల్యాణి ఇంటికి వెళ్లి, బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం సత్తుపల్లిలో ఓ ఫంక్షన్​ హాల్​ను ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి, జారె ఆదినారాయణ కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏడీఏ సరిత, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్​నాయక్ తదితరులు ఉన్నారు. 

పెనుబల్లి: పెనుబల్లి మండలం నీలాద్రి అడవుల్లో కొలువైన నీలాద్రిశ్వరుడిని కార్తీకమాసం సందర్బంగా మంత్రి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శివ లింగానికి పాలభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర నీటి పారుదల శాఖ చైర్మన్ మువ్వా విజయబాబు, ఆలయ ఈవో వెంకటరమణ, చైర్మన్ చీకటి నరసింహారావు పాల్గొన్నారు.