
- రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నల్గొండ, వెలుగు: గ్రామాల్లో ప్రతీ నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఆయనతోపాటు కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్ ,కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్ మంగళవారం నల్గొండ కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ కులాలు, తెగల వారిపై దాడుల కేసులు, భూముల సమస్యల పై సమీక్ష నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల భూములకు సంబంధించి 9 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, 31 లోగా రిపోర్టులు పంపించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి సూచించారు. దాడులకు సంబంధించి 17 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 12 కేసుల రిపోర్టులు పంపించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రణయ్ హత్య కేసులో వాదనలు వినిపించి, దోషులకు శిక్ష పడేలా చేసిన అడ్వకేట్ దర్శనం నర్సింహను సన్మానించారు.
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి
సూర్యాపేట, వెలుగు: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరిగాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇటీవల పరువు హత్యకు గురైన మాల బంటి అలియాస్ కృష్ణ కేసు గురించి చైర్మన్ మాట్లాడుతూ.. పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
నేరస్తులకు శిక్ష పడేలా చూసి, బాధితురాలైన భార్గవికి ఉద్యోగం, ఇల్లు, ఇచ్చేలా చూడాలని చెప్పారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్పీ నరసింహ అధికారులున్నారు.