- సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు
- కేంద్రం రెండోసారి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో ఎక్కువైన డిమాండ్లు
- గత నవంబర్‌లో కేంద్రం తగ్గించినా రాష్ట్ర సర్కార్ ససేమిరా
- రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన కేరళ, రాజస్థాన్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వమూ తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. పోయినసారే తగ్గించలేదని, కనీసం ఇప్పుడైనా తగ్గించి ఊరటనివ్వాలని సామాన్యులు కోరుతున్నారు. రాష్ట్రాలూ ధరలు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ధరలను తగ్గించాయి. మరికొన్ని రాష్ట్రాలు తగ్గించే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ధరలను తగ్గించాలంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో శనివారం రాత్రి నుంచి జనాలు పోస్టులు, కామెంట్లు పెడ్తున్నారు. వివిధ ప్రతిపక్షాలు కూడా రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నాయి. వాస్తవానికి నిరుడు నవంబర్‌లో దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా రాష్ట్రాలూ వ్యాట్‌ను తగ్గించుకుని ప్రజలకు ఊరటనిచ్చాయి. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం.. తగ్గించేదేలేదంటూ తేల్చి చెప్పింది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. తాము వ్యాట్‌ను పెంచనప్పుడు ధరలను ఎందుకు తగ్గించాలని ఎదురు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన రేట్ల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.82గా ఉంది.
మూడు రాష్ట్రాలు తగ్గించినయ్
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆమె సూచన మేరకు కేరళ, రాజస్థాన్, మహారాష్ట్రలు వ్యాట్‌ను తగ్గించాయి. కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 మేర వ్యాట్‌ను తగ్గిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఇటు రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 మేర వ్యాట్‌ను తగ్గించేసింది. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 తగ్గించింది. తాము కూడా పన్నును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తేస్తే తాము కూడా వెంటనే వ్యాట్‌ను తగ్గిస్తామంటూ వెస్ట్‌బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా తగ్గించే యోచనలో ఉన్నాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. పెంచేటప్పుడు తమను అడిగి పెంచలేదని, తగ్గించినప్పుడు మాత్రం తగ్గించాలంటూ ఎందుకు అడుగుతున్నారని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రశ్నించారు.
ఆర్టీసీకి రోజూ రూ.40 లక్షలు ఆదా
కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించడంతో ఆర్టీసీకి కాస్త ఊరట కలిగింది. ఆర్టీసీలో రోజూ సుమారు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన వ్యాట్ రూపంలో ఆర్టీసీ నుంచి సర్కారుకు ఒక్క రోజులోనే సుమారు రూ.కోటికి పైగా ఆదాయం వస్తోంది. ప్రస్తుతం లీటరుకు రూ.7 తగ్గడంతో ఆర్టీసీకి రోజూ సగటున రూ.40 లక్షల ఆదా అవుతుంది. అయితే, కొన్ని రోజుల కిందట డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పి ఆర్టీసీ చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. టికెట్‌పై రూ.10 నుంచి రూ.30 దాకా పెంచింది. మరి, ఇప్పుడు కేంద్రం డీజిల్ ధరలను తగ్గించింది కదా.. బస్సు చార్జీలను ఆర్టీసీ తగ్గిస్తుందా? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యాట్‌తో సర్కారుకు మస్తు ఆమ్దానీ
రాష్ట్రంలో తాము వ్యాట్ పెంచలేదని, కేవలం సవరించామని సర్కారు చెప్తున్నా.. ఎప్పటికప్పుడు వ్యాట్ రూపంలో సర్కారుకు మస్తు ఆమ్దానీ వస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూనే ఉంది. బేస్ రేటుతో పాటు ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్, ఇతర సుంకాలను కలుపుకున్నాక వచ్చే ఫైనల్ ఫిగర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం చొప్పున వ్యాట్‌ను వసూలు చేస్తోంది. రాష్ట్రంలో రోజూ సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోల్, కోటి లీటర్ల డీజిల్ అమ్ముడవుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వ్యాట్ ద్వారా రూ. 9 వేల కోట్ల ఆదాయం రాగా, 2021-22లో రూ.13,500 కోట్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే రూ.4,500 కోట్లు అదనంగా రాబట్టింది.