
ప్రాజెక్టు కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపాలన్న కేంద్రం
వరంగల్, వెలుగు : హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‍కు త్వరలోనే మెట్రో రైల్ తీసుకొస్తామని హామీలిచ్చిన ప్రభుత్వ పెద్దలు..ఏడాదిన్నరగా కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలు మాత్రం పంపడం లేదు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలు అస్సలే పట్టించుకోకుండా ఏండ్ల తరబడి టైం వేస్ట్చేస్తున్నారు. సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్న రాష్ట్ర సర్కారు స్టేట్ బడ్జెట్‌నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు. కానీ, హైదరాబాద్మెట్రోకు మాత్రం మరోసారి రూ.6 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టింది.
కాజీపేట నుంచి వరంగల్ కు 15.5 కిలోమీటర్లు
వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి హన్మకొండ మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్‍కు దాదాపు 15 నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. గ్రేటర్ వరంగల్ జనాభా 11 లక్షలకు చేరింది. ఉమ్మడి జిల్లాల నుంచి రోజూ నాలుగైదు లక్షల మంది వివిధ పనుల కోసం గ్రేటర్ వరంగల్ కు వచ్చి పోతూ ఉంటారు. దీంతో ఉదయం, సాయంత్ర సమయాల్లో హైదరాబాద్‍లో మాదిరి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వరంగల్ సిటీని ఐటీ కారిడర్‍గా మార్చే క్రమంలో మెట్రో లేదంటే నియో రైల్ తీసుకోస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఫాతిమానగర్, సుబేదారి, అంబేద్కర్జంక్షన్, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ థియేటర్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు రూట్ మ్యాప్ ఉంటుందని వెల్లడించింది.
2020లో డీపీఆర్ ఇస్తే.. 2021లో పంపిన్రు
వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కి అనుగుణంగా మెట్రో పనులను వేగవంతం చేస్తామని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ప్రభుత్వ సూచనల మేరకు సాధ్యసాధ్యాల పరిశీలనకు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‍కు అప్పజెప్పామన్నారు. దీన్ని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (కుడా) కూడా మానిటరింగ్ చేస్తోంది. దీని కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు 30 నుంచి 40 సార్లు రివ్యూలు నిర్వహించారు. పనులకు రూ.1,340 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. అర్బన్మాస్ ట్రాన్స్పోర్ట్కంపెనీ లిమిటెడ్ (యూఎంటీఎస్), మహా మెట్రో, నాగ్ పూర్, హైదరాబాద్, పుణే టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో 'కుడా' 2020 జనవరిలో డీపీఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ రిపోర్ట్‌ను ఏడాది పాటు దగ్గరే ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి నెలలో కేంద్రానికి పంపింది.
ఏడాదిన్నర నుంచి ఏదీ చెప్పట్లే
వరంగల్ మెట్రో అంశాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మన్ సోమవారం రాజ్యసభలో లేవదీశారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిశోర్స్పందించారు. ‘2021 మార్చిలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.998 కోట్లతో 15.5 కిలోమీటర్ల దూరానికి బడ్జెట్ ఇవ్వాలని కోరింది. ప్రాజెక్ట్సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట నిర్మాణంపై అప్పుడే పలు సూచనలు చేశాం. దానికి అనుగుణంగా మరోసారి ప్రపోజల్స్పంపాలని చెప్పాం. అయితే వరంగల్ మెట్రోతో పాటు కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’ అని చెప్పారు. కేంద్ర మంత్రి ఇంత స్పష్టంగా చెప్పినా హామీలిచ్చిన వారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. పైగా ఏడాదిన్నర నుంచి కేంద్రం అడిగిన ప్రపోజల్స్పంపకుండా సభలు, సమావేశాల్లో ‘త్వరలో వరంగల్ మెట్రో’ అంటూ ప్రచారం చేస్తూ జనాలను మభ్యపెడుతున్నారు.
హైదరాబాద్ మెట్రోకు మరోసారి రూ.6,250 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం 2021 రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి రూ.1000 కోట్లు కేటాయించగా.. వరంగల్ మెట్రోకు నయా పైసా ఇవ్వలేదు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవంబర్14న హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కోసం కేంద్రానికి లెటర్ రాశారు. రెండో దశలో బీహెచ్ఈల్ నుంచి లక్డీకాపూల్వరకు నిర్మించే 26 కిలోమీటర్ల ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ.8,453 కోట్లు కేటాయించేలా చూడాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ధీప్ సింగ్‍ను కోరారు. తర్వాత కేంద్రం ఫండ్స్‌తో సంబంధం లేకుండా రాష్ట్రమే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. మూడేండ్లలో రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ, ఏండ్లు గడుస్తున్నా వరంగల్మెట్రో ఊసే ఎత్తడం లేదు.
‘హైదరాబాద్ తర్వాత వరంగల్ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే వరంగల్ ట్రైసిటీలోనూ ఈజీ జర్నీ కోసం మోనో లేదంటే మెట్రో రైళ్లలో ఏదో ఒకటి అందుబాటులోకి తీసుకొస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. దీనికి సంబంధించి డీపీఆర్ కంప్లీట్ చేసి త్వరలోనే పనులను పట్టాలెక్కిస్తం’ 2020 జనవరి 7న టెక్ మహీంద్రా ప్రారంభోత్సవంలో
-ఐటీ శాఖ మంత్రి కేటీఆర్