నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి. నాయక్ సూచించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ హాలులో పోలీస్ పరిశీలకుడు దీపక్ మిశ్రా, కలెక్టర్ ఉదయ్ కుమార్, రిటర్నింగ్, నోడల్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో పాటు అభ్యర్థులకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పక్కాగా పని చేయాలన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, మిథిలేశ్ మిశ్రా, సతీశ్ కుమార్ పాల్గొన్నారు.
ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి..
ఓటర్ స్లిప్పులను అందరికీ పంపిణీ చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలోని పెద్దకొత్తపల్లి, లింగాల, పెద్ద కార్పాముల, యాపట్ల, అంబటిపల్లి, బాకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సౌలతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నెల 22 లోగా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్: ఓటరు స్లిప్పులను పక్కాగా పంపిణీ చేయాలని రాష్ట్ర స్థాయి పరిశీలకుడు అజయ్ వి. నాయక్ సూచించారు. కలెక్టరేట్ లో కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్, నోడల్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంతకుముందు కలెక్టర్ జి. రవినాయక్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్, అబ్జర్వర్లు సంజయ్ కుమార్ మిశ్రా, ఇళక్కియా కరునాగరన్, రిటర్నింగ్ ఆఫీసర్లు మోహన్ రావు, అనిల్ కుమార్, నటరాజ్ పాల్గొన్నారు.
బలగాలను రిజర్వులో ఉంచుకోవాలి
గద్వాల: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అదనపు బలగాలను రిజర్వులో ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు అజయ్ నాయక్, దీపక్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్, నోడల్ ఆఫీసర్లతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో రికార్డులు ఇవ్వాలి
క్యాండిడేట్లు ఎన్నికల ఖర్చుకు సంబంధించిన బ్యాంక్, క్యాష్, క్రెడిట్ రికార్డులను రెండు రోజుల్లో అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు సమీర్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌తో పాటు అలంపూర్‌లో వివిధ పార్టీల లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అక్బర్, విజయ భాస్కర్, నారాయణ పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో లోపాలు రావద్దు..
వనపర్తి: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని ఎన్నికల పరిశీలకుడు అజయ్ వి. నాయక్ సూచించారు. పోలీస్ పరిశీలకుడు దీపక్ మిశ్రా, కలెక్టర్, ఎస్పీతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వివరించారు. అబ్జర్వర్లుసోమేశ్మిశ్రా, రాజీవ్ మల్హోత్రా, రాజేంద్ర సింగ్, రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్. తిరుపతి రావు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి..
నారాయణపేట: పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. ఎస్పీ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిథల్, అశోక్ కుమార్, ఆర్డీవో రామచంద్ర, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రాణా ప్రతాప్ పాల్గొన్నారు.