హనుమకొండ, వెలుగు : వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు కనిపించని లీడర్లు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే వరంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. వడ్డేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ శంకుస్థాపన చేసిన రూ. 900 కోట్ల పనుల్లో రాష్ట్ర వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో కేంద్రం, కుడా నిధులు తప్ప మరే ఇతర ఫండ్స్ లేవన్నారు. కోట్లు పెట్టి సభలు పెట్టుకుంటున్న బీఆర్‌ఎస్ లీడర్లు పేదోళ్ల కోసం పైసా ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వచ్చినా ఈ సారి వినయ్ భాస్కర్ ఓటమి తప్పదన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు నిరంజన్, తరుణ్‌రెడ్డి, కార్పొరేటర్ రవినాయక్, శ్రావణ్ నాయక్ పాల్గొన్నారు.