- ఒమర్ అబ్దుల్లా వెల్లడి
- కేంద్రంతో కలిసి పనిచేస్తం
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రాబట్టుకోవడమే తమ టాప్ ప్రయారిటీ అని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ వైస్‌ప్రెసిడెంట్, కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఇదే తమ తొలి తీర్మానంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. మంగళవారం వెలువడిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో అక్కడ కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఒమర్ అబ్దుల్లానే సీఎం అని ఆయన తండ్రి, ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం ఒమర్ మీడియాతో మాట్లాడుతూ తమ టాప్ ప్రయారిటీ రాష్ట్ర హోదా సాధించడమేనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దును వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గబోమని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుందని భావించడంలేదని, కేంద్రంలో ప్రభుత్వం మారితే తప్ప పునరుద్ధరణ జరగదని ఆయన అన్నారు.
కేంద్రంతో సత్సంబంధాలే
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర పాలిత ప్రాంతమైనా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందేనని, తాము కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. అట్లని బీజేపీతో మాత్రం ఎలాంటి సంబంధాలు ఉండవని అన్నారు. ‘‘ప్రధానమంత్రి దేశానికి గౌరవనీయులు. ప్రధాని హోదాలో ఇచ్చిన మాటకు కట్టుబడి మోదీ.. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. దీనికోసం మా పోరాటం కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ఓటమిపై కాంగ్రెస్ రివ్యూ చేస్కోవాలి
జమ్మూకాశ్మీర్‌లో తమతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. హర్యానాతోపాటు జమ్మూకాశ్మీర్ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. సర్వేలన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో ఆ పార్టీ చర్చించుకోవాలని, లోపాలు గుర్తించాలన్నారు.