మూడేండ్లు.. 30 వేల మందికి ఉపాధి..బీఎఫ్ఎస్ఐ జీసీసీల్లో యువతకు ప్లేస్​మెంట్లు

మూడేండ్లు.. 30 వేల మందికి ఉపాధి..బీఎఫ్ఎస్ఐ జీసీసీల్లో యువతకు ప్లేస్​మెంట్లు
  • స్కిల్​ యూనివర్సిటీలో స్కిల్లింగ్​ కోర్సు
  •  అర్హత పరీక్ష నిర్వహించిన వర్సిటీ

హైదరాబాద్, వెలుగు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్​ సర్వీసెస్, ఇన్సూరెన్స్​(బీఎఫ్ఎస్ఐ) రంగంలో వచ్చే మూడేండ్లలో 30 వేల మంది బీటెక్​ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రణాళికలు రచిస్తున్నది. ఏటా 10 వేల మంది చొప్పున అభ్యర్థులకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించనున్నారు. అందులో 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది డిగ్రీ అభ్యర్థులకు ట్రైనింగ్​ ఇస్తారు.

అందుకు అనుగుణంగా బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్​ కోర్సు ప్రారంభించనుంది. ఆదివారం ఆ కోర్సుకు సంబంధించి అర్హత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసి యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీలో నాలుగు నెలల పాటు ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. ట్రైనింగ్​ అనంతరం బీఎఫ్ఎస్ఐ రంగంలోని గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ప్లేస్​మెంట్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను తెలంగాణ యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం రేవంత్​ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ రంగంలోనూ నైపుణ్యం ఉన్న యువతను అందించేందుకు స్కిల్ ​ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రారంభించారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో అనుభవమున్న అమెరికా, సింగపూర్​తో పాటు దేశీయ నిపుణులు, జీసీసీ సంస్థలతో సంప్రదింపులు జరిపారు.

అందులో భాగంగానే నిరుడు సెప్టెంబరులో బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్​ కోర్సును ప్రారంభించి రెండు బ్యాచ్​లకు  ట్రైనింగ్​ పూర్తిచేశారు. తాజాగా మూడో బ్యాచ్​కు పరీక్ష నిర్వహించారు. ఈ కోర్సు నిర్వహణకు అయ్యే ఖర్చును ఎక్విప్ , బీఎఫ్ఎస్ఐ కన్సార్టియంలు భరించనున్నాయి.