
- పేదలను కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నయ్
- రాష్ట్రాల నిర్లక్ష్యం ప్రైవేట్ దవాఖానాలకు వరంగా మారింది
- మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని కామెంట్
న్యూఢిల్లీ: ప్రజలకు అగ్గువకే మెరుగైన వైద్యం, మందులు, మౌలిక సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. చాలా రాష్ట్రాల్లో పేదలకు తక్కువ ధరకు వైద్య సేవలు అందడంలేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. ఫలితంగా కార్పొరేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్లు టెస్టులు, మందులు, చెకప్‌ల పేరిట పేదలను దోచుకుంటున్నాయని చెప్పింది. అత్యవసరమైన మెడిసిన్స్‌ను కూడా అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయింది.
రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వరంగా మారాయని అసహనం వ్యక్తంచేసింది. ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ.. రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లోనే మందులు కొనాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషనర్ పేర్కొన్నాడు.
అవే మందులు బయట తక్కువ ధరకు దొరుకుతున్నాయని, వాటిని తీసుకొస్తే ఒప్పుకోవడంలేదని వివరించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని నియంత్రించడంలో విఫలం అయ్యాయని వివరించాడు. ఫలితంగా రోగులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదించాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ తో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. పిటిషనర్ వాదనతో తాము ఏకీభవిస్తున్నామని, అయితే దీన్ని ఎలా నియంత్రించాలని బెంచ్ ప్రశ్నించింది. హాస్పిటల్ లోని ఫార్మసీల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని రోగులను బలవంతం చేయొద్దని ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆదేశించాలని పిటిషనర్ తరఫు అడ్వొకేట్ కోరారు.
కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలి
మెరుగైన వైద్యం, తక్కువ ధరకు మందులు అందించడమనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని బెంచ్ పేర్కొంది. ‘‘కొన్ని రాష్ట్రాలు పేదలకు వైద్యసేవలను దూరం చేశాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు సౌకర్యాలు కల్పించి వాటినే ప్రోత్సహిస్తున్నాయి. రోగులకు సూచించిన మెడిసిన్స్ వేరే చోట తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు వాటిని.. తమ ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలే నియంత్రించాలి.
పేదలకు వైద్యం, మందులు అందుబాటు ధరల్లో లభించడం కష్టమైపోయింది. ఇలాంటి దోపిడీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలి. గతంలోనూ ఇదే సమస్యపై పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశాం. కొన్ని స్టేట్స్ స్పందించిన కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి’’అని బెంచ్ గుర్తు చేసింది.