సీఏఏ వివాదం చల్లారడం లేదు. కేరళ, పంజాబ్ తరువాత లేటెస్ట్ గా రాజస్థాన్ కూడా సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ ఒకడుగు ముందుకేసి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. దీంతో అసలు కేంద్రం చేసే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు సవాల్ చేయవచ్చా, అమలు చేయకుండా నిలుపుదల చేయవచ్చా అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. దీనిపై రాజ్యాంగం ఏమంటోంది? లాయర్లు ఏమంటున్నారు?
సీీఏఏను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సంచలనానికి తెర లేపింది కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం. .రాజ్యాంగంలోని 14, 21, 24 ఆర్టికల్స్ ను ఈ చట్టం దెబ్బతీస్తుందన్నది కేరళ సర్కార్ వాదన. రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన సెక్యులరిజాన్ని, జీవించే హక్కులను లాగేసుకుంటుందని వాదిస్తోంది. ఇదొక్కటే కాదు ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చట్టం–2008’ను సవాల్ చేస్తూ చత్తీస్గఢ్ కూడా సుప్రీంలో పిటిషన్ వేసింది. ఎన్ఐఏ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకున్న హక్కులను తీసేసుకోవడమేనని చత్తీస్గఢ్ పేర్కొంది. అటు కేరళ, ఇటు చత్తీస్గఢ్ రెండు రాష్ట్రాలు ఆర్టికల్–131 కింద సుప్రీంకోర్టుకెళ్లాయి.
ఆర్టికల్ 131 ఏమంటోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 131కి ఒక ప్రత్యేకత ఉంది. రెండు రాష్ట్రాల మధ్య లేదా కేంద్రం, రాష్ట్రం మధ్య గొడవలు వస్తే ఆర్టికల్ 131 కింద ఎవరైనా న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. చట్టపరంగా తమ హక్కులు దెబ్బ తింటున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే సుప్రీం కోర్టు గడప తొక్కే అవకాశాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. ఈ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టులో హక్కులను కాపాడుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చింది.
సహజంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలోనూ అలాగే సరిహద్దుల విషయంలోనూ గొడవలు వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం కోరుతూ ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టు కెళుతుంటాయి.అయితే ఈసారి పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా మారిన సీఏఏ ను సవాల్ చేస్తూ కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది. దీంతో సీఏఏపై సుప్రీంకోర్టు ఏ విషయమై తేల్చేంతవరకు దానిని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఒత్తిడి చేయలేదు.
ఎన్ఐఏకు వ్యతిరేకంగా చత్తీస్గఢ్
తీవ్రమైన నేరాలు దర్యాప్తు చేసే ‘నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)’కు వ్యతిరేకంగా చత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టు కెళ్లింది. పోలీసు అనేది రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ లిస్ట్‌లోని అంశమని చత్తీస్గఢ్ పేర్కొంది. అయితే, కేంద్రం కనుసన్నల్లో పనిచేసే ఎన్ఐఏ ఆపరేషన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర ఉండదని చత్తీస్గఢ్ పేర్కొంది. ఇలా చేయడం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం లాగేసుకోవడమేనన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఏర్పాటు చేసిన ఎన్ఐఏ చట్టపరంగా చెల్లదని చత్తీస్ గఢ్ వాదిస్తోంది. దీంతో 2008 నాటి ఎన్ఐఏ చట్టాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును చత్తీస్గఢ్ కోరింది.
ముంబై దాడుల తరువాత……
2008 నవంబర్26 నాటి ముంబై దాడుల తరువాత ‘నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. టెర్రరిజం వంటి తీవ్రమైన నేరాలను అదుపు చేయడమే ఈ చట్టం అసలు టార్గెట్. దాడులు జరిగిన కొన్ని రోజులకే పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించింది. 2008 డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది.
ఆర్టికల్ 256 ఏమంటోంది ?
కేంద్రం చేసిన చట్టాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 పేర్కొంటోంది. అయితే ఈ విషయంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మొరాయిస్తే, అమలు చేయాల్సిందేనని ఒత్తిడి చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. మూడు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాయి. కేరళ సుప్రీంలో పిటిషన్ కూడా వేసింది. అలాగే, ఎన్ఐఏని వ్యతిరేకిస్తూ ఛత్తీస్‌గఢ్ కోర్టుకెక్కింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రం చట్టాలను అమలు చేయకుండా ఏ రాష్ట్రమూ అడ్డుకోలేదని ఆర్టికల్ 256 క్లారిటీ ఇచ్చింది.
రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు?
కె.వి.ధనుంజయ,సీనియర్ లాయర్: కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 కింద కేంద్రం చేసే చట్టాలను రాష్టాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఒకవేళ రాష్ట్రం మొరాయిస్తే గవర్నర్ సిఫార్స్‌పై చర్యలు తీసుకోవచ్చు
భూపేందర్ సింగ్ హూడా, హర్యానా మాజీ సీఎం: రాజ్యాంగ పరంగా చూసుకుంటే పార్లమెంటు చేసిన చట్టాలను కాదనే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. చట్టపరంగా వ్యతిరేకించే హక్కు మాత్రం ఉంది.
రణదీప్ సూర్జీవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి: ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రం చేసే చట్టాల విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉంది. కేంద్రం చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే ఈ ఆర్టికల్ ద్వారా సుప్రీం కోర్టులో సవాల్ చేయవచ్చు.