ధర్మసాగర్, వెలుగు : తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్టేషన్ ఘన్‌పూర్ క్యాండిడేట్ కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల, నారాయణగిరి, ముప్పారం, సోమదేవరపల్లి, దేవునూరు, రాపాకపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు సాధ్యం కాదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ డ్రామా ఆడుతోందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరంలోపు ధర్మసాగర్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో వడ్లు కొంటున్నారా ? రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు.
అనంతరం పెద్ద పెండ్యాల బీఆర్‌ఎస్ లీడర్ తోట నాగరాజు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్‌లో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితారెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, డీసీసీబీ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మునిగెల రాజు పాల్గొన్నారు.