బీఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ ను మోసం చేయలేక..వెన్నుపొడవలేకనే పార్టీ మారానని చెప్పారు స్టేసన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ఎందుకంటే వేరే పార్టీల నుంచి చేర్చుకుని మంత్రులను చేసే సంస్కృతి తీసుకొచ్చిందే బీఆర్ఎస్సేనని విమర్శించారు. పదవిలో ఉండి పార్టీ మారడంపై రాబోయే రోజుల్లో చట్టం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని పదేళ్లుగా సూచిస్తున్నా.. పట్టించుకోలేదన్నారు కడియం శ్రీహరి. ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితేనే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందన్నారు. బీజేపీ ఎదిగితే బీఆర్ఎస్ మునిగిపోతుందన్నారు.
Also Read:కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని మండిపడ్డారు కడియం. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యన్ని అపహస్యం చేస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నిందితుడు బీజేపీలో చేరగానే పునీతుడు అవుతారా? అని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలకు భద్రత లేదన్నారు. 10 ఏళ్లలో దేశంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. దేశంలో భయానక వాతావరణం ఉందని.. మణిపూర్ అల్లర్లు భారత దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. 400 సీట్లలో బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారు.. దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాలన్నారు. బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు
ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడుతారో అర్థం కావడం లేదని విమర్శించారు కడియం శ్రీహరి.. పాలకుర్తిలో మనవరాలి వయసున్న యువతి చేతిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. పల్లా రాజేశ్వర్ నిప్పు తొక్కిన కోతిలా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ ఈ దుస్థితికి రావడానికి ఆయనే కారణమన్నారు. తన దోపిడీని బయటపెడతానని పల్లా అంటున్నారు..ఒక వేళ నిరూపించకపోతే బట్టలు ఊడదీసి జనగామ చౌరస్తాలో నిలబెడతానని వ్యాఖ్యానించారు. మానకొండురులో యాభై వేల ఓట్లతో ఓడిపోయిన రసమయి బాలకిషన్ .. సిగ్గులేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజయ్య రెండు నెలలుగా కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని..కానీ తనను ఇంటికి వచ్చి ఆహ్వానించారని చెప్పారు.