దేవాదులను గత పాలకులు పట్టించుకోలే : కడియం శ్రీహరి

దేవాదులను గత పాలకులు పట్టించుకోలే : కడియం శ్రీహరి
  • స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి

ధర్మసాగర్, వెలుగు: గత పాలకులు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదని స్టేషన్ ఘనపూర్  ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్  మండలం ధర్మపురం, మలక్ పల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న మల్లన్న గండి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-3 పంప్​హౌస్, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వర్షాభావ ప్రాంతాలైన స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ, ఆలేరు నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

 గత ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సాగు నీరు అందలేదని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత కాలువల నిర్మాణం, రిపేర్లు, తూములు, యూటీలు, ఓటీల ఏర్పాటు, పంపు హౌస్ ల నిర్మాణం వంటి పనులను స్పీడప్​ చేశానని చెప్పారు. మరో ఏడాదిన్నరలో నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి గోదావరి జలాలు అందిస్తానని తెలిపారు. వేలేరు, ధర్మసాగర్, జఫర్ గడ్  మండలాలకు సాగునీటిని అందించేందుకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే రూ.105 కోట్లతో 3 లిఫ్ట్ లు మంజూరు చేయించానని, అందులో భాగంగానే లిఫ్ట్ -3 పనులను ప్రారంభించినట్లు చెప్పారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి వానాకాలం వంగాలపల్లి, ధర్మపురం, మలక్ పల్లి, వెంకటాపూర్  చెరువులు నింపి పొలాలకు గోదావరి జలాలు అందిస్తానని హామీ ఇచ్చారు.