- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ‘బీఆర్‌ఎస్ లీడర్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు.. శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ?.. ఉప ఎన్నికలు రావు.. వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. స్థానిక క్యాంప్ ఆఫీస్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో చాలా చూశానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని, ఈ నెల 24న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చెప్పిన ప్రతిపాదనలకు సానుకూల స్పందన వచ్చిందన్నారు.
అభివృద్ధి పనులకు త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని, నవంబర్‌లో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 100 పడకల హాస్పిటల్ నిర్మించేందుకు నిధులు, ఆర్టీసీ ల్యాండ్ అలాట్ చేయాలని కోరిన వెంటనే స్పందించిన సీఎం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరామన్నారు.