ఆరు నెలల్లో ప్రతి గ్రామానికి సాగునీరు

ఆరు నెలల్లో ప్రతి గ్రామానికి సాగునీరు

జనగామ, వెలుగు : వచ్చే ఆరు నెలల్లో లింగాల ఘన్​పూర్ మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించేలా కృషి చేస్తానని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఆయన లింగాల ఘన్​పూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రాధాన్యతా క్రమంలో డెవలప్ మెంట్ పనులు చేయనున్నట్లు చెప్పారు. ఘన్​పూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ల నుంచి కాలువల మరమ్మతులు చేపట్టి వచ్చే యాసంగి లోపు నీరందిస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

జనగామ నుంచి జీడికల్, పల్లగూడ వయా గుమ్మడవల్లి, కోడూరు నుంచి చీటూరు, సిరిపురం నుంచి లింగాల ఘన్​పూర్, తదితర రోడ్ల మరమ్మతులు చేపట్టి, మిగతా గ్రామాల రోడ్లను బాగు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కస్తూర్బా గాంధీ, మోడల్ స్కూల్​లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాసేపు స్టూడెంట్లకు కెమిస్ట్రీ క్లాస్​ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.