వరంగల్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కూడా ఇదే వర్తిస్తుందని, పార్టీని రక్షించుకోవడానికి ఇదే మంచి మార్గం అని రాజయ్య పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసినా ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామని ఆయన అన్నారు. రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.