
పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదు
ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్ వార్నింగ్!
జనగామ, వెలుగు : ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరు బహిరంగ విమర్శల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే రాజయ్యను మంగళవారం ప్రగతిభవన్‌కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. పంచాయితీకి ము గింపు పలకాలని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలై ఉండి ఒకరిపై ఒకరు ఆరోపణలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరి పని వారు చేసుకోవాలని, ఇంతటితో సమస్య సమసిపోవాలని క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న క్రమంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. కలిసి పని చేసుకోకపోతే మీకే నష్టమన్నట్లు తెలిసింది. త్వరలో కడియంతోనూ కేటీఆర్ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ మనిషి పేరు ఎత్తను : ఎమ్మెల్యే రాజయ్య
మంత్రి కేటీఆర్‌తో భేటీ తర్వాత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో కడియం శ్రీహరి వ్యవహార శైలిపై కేటీఆర్‌కు వివరించినట్లు చెప్పారు. గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని చెప్పానన్నారు. ‘‘ఎమ్మెల్సీ గురించి అధిష్టానానికి పూర్తి సమాచారం ఉంది. ఆయన అహంతో మాట్లాడే విధానం నాకు నచ్చడం లేదు. ప్రతి రోజూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇవన్నీ అధిష్టానానికి వివరించాను. పార్టీ చూసుకుంటుందని కేటీఆర్ నాతో చెప్పారు. ఇక నుంచి నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా ఆ మనిషి పేరు ఎత్తను. పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అధిష్టానంతో కలిసి ముందుకు వెళ్తా. కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించే ధర్నాకు అటెండ్ అవుతాను”అని కడియం పేరు ఎత్తకుండానే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
చేనేత వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలె
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నేతన్న బీమా పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. చేనేత జౌళి శాఖపై మంగళవారం ఐఎస్బీలో ఆయన రివ్యూ నిర్వహించారు. చేనేత మిత్ర పథకం విధివిధానాలు మరింత సరళీకరించేందుకు ఉన్న అంశాలపై ఆరా తీశారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌లపై ఈ ఉత్సవాల్లో అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నేతన్నల స్థితిగతులు మెరుగు పరిచేందుకు టెక్స్‌టైల్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించారు.