
చెన్నై: తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జర్మన్ తత్వవేత్త, విప్లవాత్మక సోషలిస్ట్ కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే.. మధురైలోని ఉసిలంపట్టిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పీకే ముఖయ్య తేవర్ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం (ఏప్రిల్) అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవాత్మక సోషలిస్ట్ కార్ల్ మార్క్స్‌ను కీర్తించడానికి, ఆయన సేవలకు గుర్తుగా చెన్నైలో మార్స్క్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వంద సంవత్సరాల క్రితం ట్రేడ్ యూనియన్ ఉద్యమం మొదలైన చెన్నైలో మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని నేను భావిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా.. 'ప్రపంచ కార్మికులారా ఏకం అవ్వండి' అన్న కార్ల్ మార్క్స్ ఐకానిక్ నినాదాన్ని ఈ ప్రస్తావిస్తూ.. చాలా మంది చరిత్ర సృష్టించినప్పటికీ, చరిత్ర గతిని మార్చినది మాత్రం కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. ప్రపంచ విప్లవాలకు.. ఈ ప్రపంచం ఇప్పటివరకు సాధించిన వివిధ మార్పులకు పునాది వేసింది ఆయన ఆలోచనలేనని కీర్తించారు.
►ALSO READ | కేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్.. వీణా విజయన్ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
అందరికీ ప్రతిదీ అనే మార్క్స్ ఆలోచనతో.. ఆయన వర్ధంతి సందర్భంగా మార్చి 14న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దిగ్గజ నాయకుడు మూకయ్య తేవర్ 103వ జయంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ తేవర్ తన గళాన్ని వినిపించారని ఈ సందర్భంగా ఆయన సేవలను స్టాలిన్ గుర్తు చేసుకున్నారు.