
బెల్లంపల్లి రూరల్, వెలుగు: నీతి, నిజాయితీతో ఉద్యమిస్తే హక్కులు సాధించుకోగలమని ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్అన్నారు. కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆదివాసీ వీరుడు కుమ్రం భీం విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆదివాసులు ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలన్నారు. ఆదివాసుల ఉద్యమాలను కొందరు తాకట్టుపెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలకు ఓరియంట్ సిమెంట్ కంపెనీతోనే కాకుండా అనేక రకాలుగా అన్యాయం జరుగుతోందన్నారు.
రాజకీయాలకు అతీతంగా జాతి మనుగడ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఏకతాటిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చిన్నయ్య, ఆత్రం సక్కు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, కుమ్రం భీం మనుమడు కుమ్రం సోనేరావు, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మండల అధ్యక్షులు కృష్ణ, రమణరెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.