బ్యాక్ టు ఇండియా.. వందేళ్ల కింద ఎత్తుకుపోయిన విగ్రహం

నూరేళ్ల క్రితం దొంగిలించిన.. అన్నపూర్ణ విగ్రహం తిరిగొస్తోంది

మనదేశానికి అప్పగించనున్న కెనడా వర్సిటీ

టొరంటో: నూరేళ్ల కిందట మనదేశంలో చోరీకి గురైన ‘అన్నపూర్ణ’ విగ్రహం ఇన్నాళ్లకు మళ్లీ తిరిగి రానుంది. వారణాసిలోని గంగానది ఒడ్డున ఉన్న ఓ ఆలయం నుంచి ఓ దొంగ ఎత్తుకెళ్లిన ఆ విగ్రహం ఇప్పుడు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ రెజీనాలో ఉంది. అయితే చరిత్రలో జరిగిన తప్పులను సరిచేయాలన్న ఉద్దేశ్యంతో ఆ విగ్రహాన్ని తిరిగి మన దేశానికి అప్పగించాలని ఆ వర్సిటీ నిర్ణయించింది. వర్సిటీలో ఈ విగ్రహాన్ని చూసిన ఆర్టిస్ట్ దివ్యా మెహ్రా దాని వెనకున్న కథను శోధించింది. దీంతో ఆ విగ్రహం కెనడాకు ఎలా చేరిందన్న విషయం బయటపడింది. ‘‘మెకెంజీ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ నార్మన్ మెకెంజీ 1913లో ఇండియాలో పర్యటించాడు. వారణాసిలో ఆ విగ్రహాన్ని చూసి ఎలాగైనా తీసుకెళ్లాలని అనుకున్నాడు. అతని కోరికను తెలుసుకున్న ఓ దొంగ విగ్రహాన్ని చోరీ చేసి, అతనికి అమ్మేశాడు. తర్వాత 1936లో అది మెకెంజీ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత రెజీనా వర్సిటీకి చేరింది’’ అని దివ్యా మెహ్రా గుర్తించింది. ఇదే విషయాన్ని వర్సిటీకి వివరించింది. ఆ విగ్రహాన్ని మెకెంజీ తప్పుడు పద్ధతిలో కొన్నాడని తేల్చిచెప్పింది. దీంతో విగ్రహాన్ని తిరిగి అప్పగించాలని నిర్ణయించినట్లు వర్సిటీ ప్రకటించింది. గురువారం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి మరీ.. రిటర్న్ జర్నీని ప్రారంభించామని వెల్లడించింది. దీనికి సంబంధించి కెనడాలో ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసారియాతో వర్సిటీ వీసీ థామస్ ఛాసే వర్చువల్ గా సమావేశమయ్యారు.

For More News..

పేరుకే ఎంసెట్ స్పాట్ కౌన్సెలింగ్.. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు

ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ మెచ్చుకున్నడు