భారత్‌లో చిరుతల స్థితిగతులు – 2022 పేరిట రూపొందించిన ఐదో చిరుత పులుల జనాభా నివేదికను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఇటీవల విడుదల చేశారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ), వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సంయుక్తంగా నివేదికలు విడుదల చేశాయి.
- దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన చిరుత పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించారు. ఇందుకోసం 6.4 లక్షల పని రోజులు పట్టింది. దీన్ని ప్రపంచంలోనే అతి విస్తారమైన వన్యప్రాణి సర్వేగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
- 2018లో భారత్‌లో చిరుత పులుల సంఖ్య 12,852. వాటి సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని నివేదిక వెల్లడించింది. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1022 చిరుతలు పెరిగాయి. పెరుగుదల శాతం 7,95.
- మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. శాతాల పరంగా చూస్తే 282 శాతం చిరుత పులులు పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
- చిరుత పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 3,907 చిరుత పులులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (1985), కర్ణాటక (1879), తమిళనాడు (1070) ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో 599, తెలంగాణలో 297 చిరుత పులులు ఉన్నాయి. 2018 లెక్కలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో చిరుతల సంఖ్య 15.65 శాతం పెరగ్గా, తెలంగాణలో 11.07 శాతం తగ్గింది.
- ఏపీలోని నాగార్జునసాగర్ –శ్రీశైలం టైగర్ రిజర్వ్ (270), మధ్యప్రదేశ్‌లో పన్నా (256), సాత్పుర (215) ప్రాంతాల్లో చిరుతలు అత్యధికంగా నివాసం ఉంటున్నాయి.
- తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులో 121, కవ్వాల్‌లో 19 చిరుత పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి.
- మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిరుత పులుల సంతతి పెరగ్గా, తెలంగాణ, గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో తగ్గింది. ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు అంటే సుమారు 192 చిరుతలు తగ్గాయి.