యానిమల్ నిర్మాతలకు షాక్.. OTT రిలీజ్పై స్టే?

యానిమల్ నిర్మాతలకు షాక్..  OTT రిలీజ్పై స్టే?

యానిమల్(Animal) మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ఈ సినిమాను జనవరి 26న స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అనుకోని విదంగా యానిమల్ మేకర్స్ కి పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ ఆపేయాలంటూ కోర్టుకు ఎక్కారు యానిమల్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన సినీ వన్ స్డూడియోస్. దీంతో యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సంధిగ్ధం నెలకొంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. యానిమల్ మూవీ నిర్మాత టి సిరీస్ సంస్థ సినీ వన్ స్డూడియోస్తో కుదుర్చుకున్న ఎగ్రిమెంట్ ఉల్లంఘించారట. యానిమల్ సినిమాలో తమకు 35 శాతం ప్రోఫిట్ షేర్ ఉందని, ప్రోఫిట్ షేరింగ్ విషయంలో టి సిరీస్ ఒప్పందాన్ని గౌరవించలేదని, సినిమాకు వచ్చిన డబ్బులో తమకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని సినీ వన్ స్డూడియోస్ పిటీషన్ లో తెలిపింది. అందుకే యానిమల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై స్టే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరింది. అంతేకాదు.. యానిమల్ సినిమాకు సీక్వెల్‌గా యానిమల్ పార్క్ ప్రకటించడంపై కూడా అభ్యంతరం తెలిపింది సినీ వన్ స్టూడియోస్. 

అయితే ఈ వివాదంపై టి సిరీస్ సంస్థ తరపు న్యాయవాది అమిత్ సిబల్ స్పందిస్తూ.. యానిమల్  సినిమా హక్కుల్ని సినీ వన్ స్టూడియోస్ సంస్థ రూ.2.2 కోట్లకు వదులుకుందని, ఆ విషయాన్నీ సినీ వన్ స్టూడియోస్ కోర్టు వద్ద దాచిపెట్టిందని, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న కోర్టు.. తాము చేసుకున్న ఒప్పందం గురించి ఎందుకు ప్రస్తావించలేదని, వెంటనే ఆ విషయంపై వివరణ ఇవ్వాలని సినీ వన్ స్టూడియోస్ సంస్థను ఆదేశిస్తూ.. కేసు విచారణ జనవరి 18కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో జనవరి 26న యానిమల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందా? కాదా? అనేది అనుమానంగా మారింది.