ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహ ఏర్పాటుపై స్టే.. ఇది శ్రీకృష్ణుని విజయమన్న కరాటే కళ్యాణి

కొన్ని రోజులుగా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల వివాదాస్పద కామెంట్స్ చేసిన నటి కరాటే కళ్యాణి.. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇది శ్రీ కృష్ణ పరమాత్ముని విజయంగా పరిగణిస్తున్నామని చెప్పారు. శ్రీ కృష్ణుడి రూపం మార్చామని తానా వాళ్లు తప్పుడు మాటలు చెప్పారని కళ్యాణి ఆరోపించారు.

ఎన్టీఆర్ ను, శ్రీకృష్ణున్ని కలపొద్దు..

అంతకుముందు శ్రీకృష్ణ భగవానుడి రూపాన్ని పెట్టమని తాను అంటున్నానని కరాటే కళ్యాణి అన్నారు. పెడితే ఎన్టీఆర్ లేదా శ్రీకృష్ణ విగ్రహం.. రెండింటీలో ఏదో ఒకటి మాత్రమే పెట్టండని ఆమె కోరారు.  రెండు కలపొద్దనేదే తన పోరాటమని కరాటే కళ్యాణీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తెర మీదే దేవుడని.. ఆయన ఇలలో దేవుడు కాదని చెప్పారు. ఆయన్ని ఇలలో దేవుడి లా ఎవ్వరూ కొలుచుకోలేరని కరాటే కళ్యాణి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి.

ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరుతూ ఇటీవల మా అసోసియేషన్ కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వలేదనే కారణంతో ఆమె సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. తానేంతప్పు చేశానో అర్థం కావడం లేదన్నారు. తాను ఎన్టీఆర్ విగ్రహానికి వ్యతిరేకం కాదన్న ఆమె.. కృష్ణుడి రూపంలో పెట్టడానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల షోకాజ్ నోటీసులపై స్పందించలేదని చెప్పారు. ఇంతలోనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించార్నారు. 23 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని, ఏం జరిగినా ముందుండి పాల్గొన్నానని ఈ సందర్భంగా కరాటే కళ్యాణి అన్నారు. తన ఇండస్ట్రీ అని రాసుకుని పూసుకుని తిరిగినందుకు మంచి గిఫ్ట్ ఇచ్చారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎవరో ఎక్కడో కుట్ర చేశారని, తన సభ్యత్వం రద్దు చేసినా ఇండస్ట్రీని వదిలి వెళ్ళనని, ఇక్కడే ఉంటా అని కరాటే కళ్యాణి తేల్చి చెప్పారు.

హైకోర్టు స్టే

ఖమ్మంలో ఈ నెల 28న ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహావిష్కరణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. అమెరికాలోని తానా సహకారంతో ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. అందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉందని.. యాదవులను, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా విగ్రహాన్ని తయారు చేశారని పేర్కొంటూ భారత యాదవ సమితితోపాటు మరో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ గురువారం విచారించారు. శ్రీకృష్ణుడి రూపంలో  ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ లాయర్ సరసాని సత్యంరెడ్డి, చెలికాని వెంకట యాదవ్‌‌‌‌ కోర్టుకు తెలిపారు.

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా..

ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయంపై వివాదం చెలరేగింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఏర్పాటు చేయడాన్ని పలువురు  వ్యతిరేకించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో రూపొందించడంతో ముఖ్యంగా యాదవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.