హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తిరువకోవేలూరు మారుతి స్వామి సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించింది. మారుతి స్వామి రెండున్నర దశాబ్దాలకు పైగా ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల కానుకలను లెక్కించే సమయంలో ఆయన ఆలయ హుండీలోని ఉంగరాన్ని దొంగిలించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ఎండోమెంట్స్ వింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధిత ధర్మకర్త హైకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్‌ను జస్టిస్ చిల్లకూరు సుమలత విచారించారు. మారుతి స్వామి తరఫు అడ్వకేట్ వాదిస్తూ..ఎలాంటి విచారణ జరపకుండా ధర్మకర్తను సస్పెండ్ చేయడం ఏకపక్ష నిర్ణయమని కోర్టుకు చెప్పారు. విధించిన శిక్ష ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 28కి విరుద్ధంగా ఉందని తెలిపారు. అడ్వకేట్ వాదనలతో ఏకీభవించిన కోర్టు..మారుతి స్వామి సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే హుండీ లెక్కింపు ప్రక్రియల్లో ధర్మకర్త మారుతి స్వామి పాల్గొనకూడదని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.